2024లో బీజేపీకి కష్టమే.. విపక్షాలకు మంచి ఛాన్స్ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలను 2024లో సాధించడం కష్టమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీని అధికారానికి దూరం చేయొచ్చని శశిథరూర్ పిలుపునిచ్చారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లను కోల్పోతుందని ఆయన జోస్యం చెప్పారు. 2019 నాటి ఎన్నికలను ఈసారి రీపిట్ చేయడం బీజేపీకి సాధ్యం కాదన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోనూ అధికారం కోల్పోవచ్చని శశిథరూర్ అన్నారు. గత ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాలకు గాను 303 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుందని.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 272 కాగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ మార్పును అందుకోలేదని ఆయన జోస్యం చెప్పారు. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీని అధికారానికి దూరం చేయొచ్చని శశిథరూర్ పిలుపునిచ్చారు.
ఇకపోతే.. భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ మరో యాత్రకు సిద్ధమవుతోంది. వరుస ఎన్నికల పరాజయాల నేపథ్యంలో ప్రజల్లో తన పాత స్థానాన్ని పునరుద్ధరించుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ గణతంత్ర దినోత్సవం నుండి హత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రాసిన లేఖతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి ఆయన ఆలోచనలను ప్రచారం చేస్తారని పార్టీ తెలిపింది.
Also Read: మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. హత్ సే హత్ జోడో యాత్రగా నామకరణం.. ఎప్పటి నుంచి అంటే ?
ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం ప్రకటించారు. ఈ హత్ సే హత్ జోడో కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ప్రతీ పంచాయతీ, ప్రతి బ్లాక్, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలిపారు. “ మేము జనవరి 26 నుండి హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. ఇందులో మేము రాహుల్ గాంధీ లేఖతో ఇంటింటికీ వెళ్లి ప్రతీ పంచాయతీకి, గ్రామంలోని ప్రతీ బ్లాక్‌కు వెళ్తాం. మోడీ ప్రభుత్వంపై చార్జిషీటు కూడా తెస్తాం’’ అని రమేష్ అన్నారు.