కరోనా విజృంభణ వేళ అందరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ సంపద అంతలా ఎలా పెరిగిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఎవరైనా సమాధానం చెప్పగలారా? అంటూ ట్వీట్ చేశారు. 16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ సంపద ఈ ఒక్క ఏడాదిలోనే (2021) 50 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రపంచంలో మరే ఇతర కుబేరుడూ సాధించని ఘనతను అదానీ సాధించారని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అదానీకి సంపద పెరుగుదలకు సంబంధించిన వార్తా క్లిప్పింగ్‌ను రాహుల్‌ జత చేశారు.

‘2020లో మీ సంపద ఎంత పెరిగింది.. సున్నా! మీరంతా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆదానీ సంపద 50 శాతానికి పైగా పెరిగింది. అదెలాగో చెప్పగలరా?’’ అంటూ రాహుల్‌ ప్రజలను ప్రశ్నించారు. 

కాగా  బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. 2021లో ప్రపంచ కుబేరుడి స్థానం కోసం పోటీపడుతున్న ఎలన్‌ మస్క్, జెఫ్ బెజోస్‌లను సైతం ఆదానీ వెనక్కి నెట్టడం విశేషం. ఒక్కటి మినహా ఆదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మొత్తం ఈ ఏడాది దాదాపు 50 శాతం మేర పరుగులు పెట్టాయి. అటు ఆసియాలోనే ధనవంతుడైన ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది 8.1 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.