న్యూఢిల్లీ: కశ్మీర్ యువతులపై హర్యాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖట్టర్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ భావజాలానికి అద్దంపడుతున్నాయంటూ విమర్శించారు. 

కశ్మీర్‌ అమ్మాయిలపై హర్యాణా సీఎం ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. బలహీన మనస్కుడు, అభద్రతతో కూడిన వ్యక్తికి ఏళ్లకు ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చిన శిక్షణకు ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తుస్తాయంటూ నిప్పులు చెరిగారు. మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమి ఆస్తులు కాదని రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా ఖట్టర్ పై మండిపడ్డారు.   

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటున్నాయి. కశ్మీర్‌ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. బక్రీద్ సందర్భంగా ఇప్పటికే 144 సెక్షన్ ఎత్తివేశారు. 

ఇలాంటి తరుణంలో ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు అంటూ యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ సైనీ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ ఘటన మరువకముందే హర్యాణా సీఎం ఖట్టర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీస్తోంది. తమ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. అందరి చూపు ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. 

ఆర్టికల్‌ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతారంటూ మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీరీ అమ్మాయిలపై సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు