న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందించే సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించడంపై కాంగ్రెసు సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలోని మూడు నగరాల్లో కరోనా వ్యాక్శిన్ తయారీకి జరుగుతున్న ఏర్పాట్లపై నరేంద్ర మోడీ సమీక్షించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాలను మోడీ సందర్శించారు. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ ను నైతిక స్థయిర్యాన్ని మోడీ సందర్శన పెంచుతుందని ఆయన అననారు. కోవిడ్ -19ను ఎదుర్కునే విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషి దేశ ప్రజలకు భరోసా కలిగిస్తుందని ఆయన అన్నారు. మోడీ వ్యాక్సిన్ పర్యటనపై కాంగ్రెసు నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్న వేళ ఆనంద్ శర్మ ప్రశంసలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనకు దిగిన వేళ ప్రధాని మోడీ వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించడాన్ని కాంగ్రెసు అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తప్పు పట్టారు. మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. 

ఆనంద్ శర్మ యుపీఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో సంపూర్ణమైన మార్పులు తేవాలని కోరుతూ ఎఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నాయకుల్లో ఆయన కూడా ఉన్నారు. 

నరేంద్ర మోడీ సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్, జైడుస్ కడిలాలను సందర్శించడం భారత శాస్త్రవేత్తలకు, వ్యాక్సిన్ తయారీ కోసం వారు పెడుతున్న శ్రమను గుర్తించినట్లయిందని ఆనంద్ శర్మ అన్నారు. 

ఆ ట్విట్ చేసిన కొద్దిసేపటికే ఆనంద్ శర్మ మరో ట్విట్ చేశారు. తొలి ట్విట్ కు విచారం వ్యక్తం చేస్తున్నానని, పంక్తుల స్థానభ్రంశం జరిగిందని, దాని వల్ల కొంత అయోమయం ఏర్పడిందని ఆయన అన్నారు.