పిల్లలను ఎత్తుకెళ్లేవారనే అనుమానంతో కాంగ్రెస్ నాయకులను జనం చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలోని నవాల్ సింఘానా గ్రామం మీదుగా కొందరు కాంగ్రెస్ నాయకులు వెళుతున్నారు.

వీరిలో బేతుల్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ధర్మేంద్ర శుక్లా, మరో కాంగ్రెస్ నాయకుడు ధర్ము సింగ్ లంజివర్, ఓ గిరిజన నాయకుడు లలిత్ బారస్కర్ ఉన్నారు. వీరంతా షాహ్‌పూర్‌కు కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డగించి.. వీరిని చితకబాదారు.

గ్రామంలో చిన్నారులను అపహరించే ఓ ముఠా సంచరిస్తోందని పుకారు రావడంతో గ్రామస్తులు వీరిని అనుమానించారు. రోడ్లపై చెట్ల కొమ్మలు పడేసి వారిని అడ్డగించారు... దీంతో కారులో ఉన్న వారు ఇది దోపిడీ దొంగల పని అయి ఉంటుందని భావించి కారు దిగి చుట్టూ పరిశీలిస్తుండగా గ్రామస్తులు చుట్టుముట్టి వారిని కొట్టారు.

ఈ ఘటనలో కాంగ్రెస్ నాయకులు గాయపడటంతో పాటు కారు కూడా దెబ్బతింది. ఈ సమయంలో ఒక కాంగ్రెస్ నాయకుడు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.