కేఫ్ కాఫీ డే యజమాని సిద్ధార్థ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఆయన మృతదేహం నదిలో లభ్యమైంది. కాగా... ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ కూడా ఈ ఘటనపై స్పందించారు.

సిద్ధార్థ మృతికి సంతాపం తెలియజేసిన సంజయ్ నిరుపమ్.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిద్ధార్థ మరణానికి కారణం ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

‘దేశ వ్యాప్తంగా 1700 కాఫీడే అవుట్ లెట్స్ కు యజమాని అయిన సిద్ధార్థ మృతదేహం ఓ నదిలో లభించింది. ఆయన మృతికి కారణం ఎవరు? మోదీ ప్రభుత్వమా? ఐటీ అధికారులా? లేదా ప్రైవేటు ఈక్విటీ భాగస్వాములా? దీనిపై దర్యాప్తు చేపట్టాలి. అందరు వ్యాపారులు దొంగలు కాదు’ అంటూ నిరుపమ్ ట్వీట్ చేశారు.

సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నదిలో లభించింది. వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన నదిలో దూకడం తాను కల్లారా చూశానంటూ స్థానిక వ్యక్తి ఒకరు చెప్పడం విశేషం. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.