మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ బారు తన మాజీ బాస్‌పై రచించిన పుస్తకం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలియచేస్తూ వాస్తవాలు వక్రీకరించారని ఆరోపించింది.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో తలెత్తిన అంతర్గత రాజకీయాలకు మన్మోహన్ సింగ్ బాధితులయ్యారన్నట్లు ఈ చిత్రం ట్రైలర్‌లో చిత్రీకరించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం తెలపింది. చిత్రం విడుదలకు ముందు తమకు ఈ చిత్రాన్ని చూపించాలని, లేని పక్షంలో దేశంలో ఈ చిత్రం ఎక్కడా ప్రదర్శించడానికి తాము అనుమతించబోమని మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ గురువారం చిత్ర నిర్మాతలను హెచ్చరించింది.

 

‘‘ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుగానే మా పార్టీ కార్యవర్గ సభ్యులకు చూపిచకపోయినా, మేము సిఫార్సుచేసిన సన్నివేశాలను తగిన విధంగా మార్చకపోయినా మీరు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను వక్రీకరించదలచినట్లు అర్థం చేసుకోవలసి వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం ఎలాగే మాకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’’ అంటూ  మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యజీత్ తంబే పాటిల్ చిత్ర నిర్మాతలైన సునీల్ భోరా, ధవల్ గడాలకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా..అసలే ట్రైలర్ వివాదాస్పదంగా ఉంది అంటే.. అగ్నికి ఆజ్యం పోసినట్లు బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను బీజేపీ ట్వీట్ చేయడం కాంగ్రెస్‌ను మరింత అసహనానికి గురి చేసింది. మన్మోహన్‌ను కేవలం బొమ్మగా మార్చి పదేళ్ల పాటు ఓ కుటుంబం దేశాన్ని ఎలా ఏలిందో చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ బీజేపీ ట్రైలర్‌ను ట్వీట్ చేయడం గమనార్హం.

కాగా.. బీజేపీ ట్వీట్లపై కాంగ్రెస్ నేతలు మరింత సీరియస్ అవుతున్నారు. అయితే.. తమ మాటలను బీజేపీ సమర్థించుకోవడం విశేషం. ఓ సినిమా గురించి మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు లేదా అంటూ బీజేపీ నేత ఒకరు ట్వీట్ చేశారు.