న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసినవారంతా  పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.  అంతేకాదు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు. 

 

 

 

 

దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన అర్ధాంతరంగా నిలిపివేశారు. ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని  ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు  కరోనా సోకింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో  చికిత్స పొందుతున్నారు. 

దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తదితరులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకడంతో ప్రియాంకగాంధీ ఇటీవలనే హోంక్వారంటైన్ లోకి వెళ్లింది. దీంతో ఆమె ఎన్నికల ప్రచార సభలను అర్ధాంతరంగా రద్దు చేసుకొంది.