New Delhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన భారత వ్యతిరేక శక్తుల భాషలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. లండన్ లో భారత్ గురించి రాహుల్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
Union Law Minister and BJP leader Kiren Rijiju: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తుల భాషలో మాట్లాడుతున్నారనీ, భారతదేశాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు కుట్ర పన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు కిరణ్ రిజిజు ఆరోపించారు. లండన్ లో భారత్ గురించి రాహుల్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తోటి పార్లమెంట్ సభ్యుని చర్యను ఖండించకపోతే ప్రజలు ప్రశ్నిస్తారనీ, లండన్ లో చేసిన వ్యాఖ్యలకు సభలో క్షమాపణలకు డిమాండ్ చేస్తామని కిరణ్ రిజిజు మీడియాతో అన్నారు. తాము ప్రజాప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నామని చెప్పిన ఆయన.. భారత వ్యతిరేక శక్తులు, ముఠాలన్నీ ఒకే భాష, లైన్ కలిగి ఉన్నాయని కాంగ్రెస్, రాహుల్ పై విమర్శలు చేశారు.
"రాహుల్ గాంధీ మాట్లాడే భాష భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు, భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారు మాట్లాడే భాష. ఆయన పార్లమెంటులో క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ కోరడం మా కర్తవ్యం" అని పేర్కొన్నారు. కాలేజీలు, యూనివర్శిటీల ప్రసంగంలో.. తనను మాట్లాడనివ్వడం లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు దేశాన్ని బాధిస్తాయని రాహుల్ గాంధీ చెప్పారని రిజిజు పేర్కొన్నారు. అయితే, ఇందులో వాస్తవం లేదని మంత్రి చెప్పారు. 'ఇది కూడా పూర్తిగా అవాస్తవం. తన దేశవ్యాప్త భారత్ జోడో యాత్రలో పగలు, రాత్రి తేడా లేకుండా పలుమార్లు ప్రసంగించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కువ మాట్లాడే వ్యక్తి రాహుల్ గాంధీ" అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ దాని గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని, రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను అవమానించారని కిరణ్ రిజిజు ఆరోపించారు.
"ఆయన (రాహుల్ గాంధీ) వ్యక్తిత్వం ఎలా ఉంటుందో భారతీయులకు తెలుసు. భారత ప్రజలు ఆయనను సీరియస్ గా తీసుకోరు. కానీ విదేశాల్లోని ప్రజలు మాత్రం ఆయన నిజం మాట్లాడతారని అనుకుంటున్నారు. కాంగ్రెస్ లండన్ వెళ్లి క్షమాపణలు చెబుతుందా? ఆయన క్షమాపణ కోరడం మా కర్తవ్యం" అని మంత్రి పేర్కొన్నారు. కాగా, యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందనీ, దేశ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే విషయంతో పాటు ప్రధాని మోడీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యల గురించి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ చర్యల గురించే ప్రధాని మోడీ మాట్లాడారని అన్నారు. మోడీ సొంతంగా ప్రధాని కాలేదనీ, 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సుల వల్లే ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మోడీ పాత్రను ప్రపంచం కూడా గుర్తిస్తోందని తెలిపారు. భారతదేశంలోని మైనారిటీ వర్గాల గురించి రాహుల్ గాంధీ పూర్తిగా తప్పుడు ప్రకటనలు చేశారని రిజిజు విమర్శించారు.
"భారత్ లో మైనార్టీలకు భద్రత లేదని రాహుల్ అన్నారు. మైనారిటీలు ద్వితీయ లేదా తృతీయ శ్రేణి పౌరులుగా అభివర్ణించారు. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలే. నేను మైనారిటీ వర్గానికి చెందినవాడిని. మైనారిటీలైన తాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్ లో స్వేచ్ఛగా జీవిస్తున్నామని" చెప్పారు.
