ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకుంది. కాగా, మహిళా సాధికారత అంశంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మాయవతిని ముందేసి మళ్లీ దళితులపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు తాము కూటమికి ప్రతిపాదించామని, సీఎం పోస్టు కూడా మాయవతికి ఆఫర్ చేశామని రాహుల్ పేర్కొన్నారు. కానీ, మాయవతి నుంచి సమాధానం రాలేదని అన్నారు.
లక్నో: పార్లమెంటు ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాలా కీలకమైంది. ఇక్కడి ప్రజలు ఓట్లే చాలా వరకు కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే పార్టీని నిర్ణయించేస్తాయి. రెండు దఫాలు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీని ఎలాగైనా ఓడించాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి సార్వత్రిక ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ నుంచే ఆ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు అర్థం అవుతున్నది. సార్వత్రిక ఎన్నికలకు ప్రీఫైనల్‌గా భావించిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు భూస్థాపితం అయింది. ఇక బీఎస్పీ ఒకే ఒక్క సీటుకు పరిమితం అయింది. బీఎస్పీ కంటే ఒక్క సీటును కాంగ్రెస్ ఎక్కువ గెలుచుకుంది. దీంతో 2024 జనరల్ ఎన్నికలకు సిద్ధం అయ్యే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే 1980లలో అద్భుతంగా పని చేసిన దళిత ముస్లిం బ్రాహ్మిణ్ ఫార్ములాను మళ్లీ అమలు చేయాలని భావిస్తున్నదా? అనే ఆలోచనలు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో రేకెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ దాదాపు తుడుచుకుపెట్టుకుపోయిన నేపథ్యంలో ఆయన మళ్లీ దళిత ఓటు బ్యాంక్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.
రాహుల్ గాంధీ శనివారం తన స్నేహితుడు కే రాజు రాసిన ‘ద దళిత్ ట్రూత్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాలను ఆయన వెల్లడించారు. మాయావతి అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్ చేయలేదని అన్నారు. ఎన్నికలకు ముందే తాము మాయవతితో కూటమి కోసం ప్రతిపాదనలు పంపామని వివరించారు. అలయెన్స్ అధికారంలోకి వస్తే.. సీఎం పోస్టు కూడా మాయవతికి ఆఫర్ చేశామని చెప్పారు. కానీ, తమకు ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. యూపీలో దళితుల కోసం కాన్షీరాం జీ తన గళాన్ని ఎత్తారని గుర్తు చేశారు. ఆయనను తాను ఎంతో గౌరవిస్తానని చెప్పారు. యూపీలో దళితుల్లో చైతన్యం పెంచడానికి అహోరాత్రులు శ్రమించారని వివరించారు. కాంగ్రెస్ కొంత నష్టపోయిన మాట వాస్తవమే అది వేరే విషయం అని పేర్కొన్నారు. కానీ, ఈ రోజు దళితుల కోసం మాయవతి ఫైట్ చేయడం లేదని ఆరోపించారు.
ఆమె దళితులకు ఉన్న మైదానాన్ని ఖాళీగా వదిలిపెట్టారని రాహుల్ గాంధీ చెప్పారు. ఎందుకు? ఎందుకంటే.. సీబీఐ, ఈడీ, పెగాసెస్ వల్లే కదా? అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయవతి స్పందించలేదు. ఆమె వ్యాఖ్యల కోసం రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ యూపీలోని దళితులపై ఫోకస్ పెడుతున్నట్టు విశ్లేషిస్తున్నారు. 1980 మధ్యలో సక్సెస్ అయిన దళిత్, ముస్లిం, బ్రాహ్మిణ్ ఫార్ములాను మళ్లీ ఇంప్లిమెంట్ చేయాలని యోచిస్తున్నట్టు పేర్కొంటున్నారు.
అదే వేదికపై నుంచి రాహుల్ గాంధీ దళితుల కోణంలో నుంచీ మాట్లాడారు. ప్రపంచంలో మరెక్కడా లేని వివక్ష కేవలం మన దేశంలోనే ఉన్నదని వివరించారు. ఇక్కడ జంతువులనైనా ముట్టుకుంటారేమో కానీ, మనుషులను ముట్టుకోని జాఢ్యం ఒకటి ఉన్నదని తెలిపారు.
యూపీలో మాయవతి నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఒకే ఒక్క సీటుకు పడిపోయింది. ఇందుకు కారణంగా ఆమె తమ భావజాలానికి విరుద్ధంగా ఎన్నికల్లో వెళ్లారని నిపుణులు చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటును కూడా బీఎస్పీ క్యాష్ చేసుకోలేకపోయిందని అన్నారు. ఎందుకంటే.. చాలా మంది దళితులు బహుశా ఎన్నికల అనంతరం బీజేపీతో బీఎస్పీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అనుమాన పడ్డారు. ఎందుకంటే.. బీఎస్పీ చేసిన వ్యాఖ్యలు తన భావజాలానికి విరుద్ధంగా ఉండటమే కాదు.. బీజేపీకి కలిసివచ్చేలా ఉన్నాయని వివరించారు. ఆ కారణంగానే దళితులు కొందరు బీజేపీతోనే వెళ్లగా మరికొందరు ఎస్పీవైపు మొగ్గారని విశ్లేషించారు. కాంగ్రెస్ ఈ సారి మహిళా సాధికారత అంశంగా బరిలోకి దిగి దారుణంగా ఓడిపోయింది.
