కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె, ప్రియాంక గాంధీ రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే ప్రియాంక.. కొన్ని విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ వుంటారు.

తాజాగా ఆమె తన పెళ్లినాటి ముచ్చట్లను పంచుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అవి సరిగ్గా 24 ఏళ్ల క్రితం 'ఫూలోన్ కా గెహ్నా' (కశ్మీరి సాంప్రదాయం ప్రకారం వధువును పూలతో అలంకరించే వేడుక ) సమయంలో తీసిన ఫోటోలని ప్రియాంక చెప్పారు.

వీటిని చూసిన నెటిజన్లు, కాంగ్రెస్ అభిమానులు ఆమె ఎంత అందంగా ఉందో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటోలకు వేలసంఖ్యలో లైకులు వచ్చాయి. కాగా, 1997 ఫిబ్రవరి 18 న వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో ప్రియాంక వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

కాశ్మీర్ సంప్రదాయం ప్రకారం పెళ్లికి రెండు రోజుల ముందు ఈ పూల వేడుకను నిర్వహిస్తారు. ప్రియాంక షేర్‌ చేసిన ఫ్రీ వెడ్డింగ్‌ ఫోటోలో ఆమె వెంట ఆడపడుచు మిచెల్ వాద్రా కూడా ఉన్నారు. 2001లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మిచెల్ మరణించారు. 

ఇక గతంలో చీర కట్టులో ఉన్న ఫోటోను షేర్‌ చేసిన ప్రియాంక గాంధీ.. ఆమె పెళ్లి రోజు పూజా సమయంలోని ఫోటోని షేర్‌ చేశారు.  #SareeTwitter అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఆమె పోస్టుకు ట్యాగ్‌ చేశారు. ప్రియాంక తన పెళ్లి నాటి ఫోటోను షేర్‌ చేసిన కొన్ని క్షణాల్లోనే అది వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.