Uttarakhand: ఉత్త‌రాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బీజేపీని ఇబ్బంది పెట్టవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి స‌ల‌హా ఇచ్చారు. యూసీసీపై న్యాయ సలహా తీసుకోవాలని సూచించారు.  

Uttarakhand: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఉమ్మ‌డి పౌర‌స‌త్వం (యూనిఫాం సివిల్ కోడ్‌)ను అమలు చేస్తానని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చేసిన హామీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ స్పందిస్తూ.. "మీ పార్టీని ఇబ్బంది పెట్టవద్దు" అని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి వాగ్దానాలు ఇవ్వ‌డం వ‌ల్ల‌ బిజెపి ఓడిపోతోందని, ఇలాంటి హామీల వ‌ల్ల పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతోంద‌ని, స్పష్టమవుతోందన్నారు. యూసీసీపై న్యాయ సలహా తీసుకోవాలని క‌పిల్ సిబ‌ల్ విరుచుకుపడ్డారు.

కపిల్ సిబల్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘పుష్కర్ ఎస్ ధామి! బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ ప్రకటనలు చేసి, దయచేసి మీ పార్టీని ఇబ్బంది పెట్టొద్దు, మీరు చిక్కుల్లో పడొద్దు. ఇలాంటి హామీల వ‌ల్ల పార్టీ బలహీనపడుతోందని, మీకు యూసీసీపై న్యాయ సలహా అవసరమని అర్థమవుతోంది’’ అని పేర్కొన్నారు. 

అంతకుముందు.. పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. సమానత్వం అందించడానికి యుసిసి యొక్క ముసాయిదాను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మ‌త‌ విశ్వాసంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం, ఇతరులకు సంబంధించి అందరికీ సమాన చట్టం తీసుక‌వ‌స్తామ‌ని ఎన్నిక‌ల హామీలు ఇచ్చారు. యూనిఫాం సివిల్ కోడ్ వ‌ల్ల‌ మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారి కలలను సాకారం చేయడానికి సహాయపడుతుందని, రాజ్యాంగ స్ఫూర్తిని పటిష్టం చేయడానికి దోహదపడుతుందని ధామి అన్నారు. పౌరులందరికీ UCC కోసం పిలుపునిచ్చే ఆర్టికల్ 44 వైపు ఇది ఒక ముఖ్యమైన అడుగని అన్నారు.

ఈ వ్యాఖ్యపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. UCC అంటే సాధారణం కాదని సీఎం అర్థం చేసుకోవాలని అన్నారు. మ‌న‌దేశం భిన్నత్వంలో ఏకత్వమ‌ని, విభిన్న మ‌తాలు ఉన్నా.. ఈ దేశంలో అందరికీ ఓ చ‌ట్టం సరిపోదని ఆయన అన్నారు. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి వ్యక్తి/సమాజానికి వారి సంస్కృతిని కాపాడుకునే/ఆచరించుకునే హక్కు ఉందని ఒవైసీ పేర్కొంది. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఈ ప్రకటనను స్వాగతించారు. ఉత్తరాఖండ్ వైవిధ్యం, విశిష్ట సంస్కృతిని రక్షించడానికి UCC అవసరం ఉందని అన్నారు.