మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత నేత కమల్‌నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో సీఎల్పీ నేత పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ రాశారు. 

అసలే రెండు సార్లు కేంద్రంలో అధికారానికి దూరమవ్వడం, ఒక్కొక్క రాష్ట్రంలో ఓడిపోతుండటం, కీలక నేతలు బై బై చెబుతుండటంతో కాంగ్రెస్ పార్టీ (congress) తీవ్ర నైరాశ్యంలో వున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్ధితుల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకీ షాకిచ్చారు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి క‌మ‌ల్‌నాథ్ (kamalnath). అసెంబ్లీ ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌వికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు త‌న రాజీనామా లేఖ‌ను హైక‌మాండ్‌కు కూడా పంపించారు. కమల్‌నాథ్‌ రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో పాటు డాక్టర్ గోవింద్ సింగ్‌ను తదుపరి సీఎల్పీ నాయకుడిగా నియమించింది. అయితే ఉన్నపళంగా కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా ఎందుకు చేశారనే దానిపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. 

కాగా, ఆయన నిర్ణయాన్ని ఆమోదిస్తూ సోనియా గాంధీ (sonia gandhi) నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (kc venugopal) ఒక ప్రకటనలో తెలిపారు. శాసనసభా పక్ష నేతగా కమల్‌నాథ్ రాజీనామా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇంతకాలం సీఎల్పీ నేతగా కమల్‌నాథ్ చేసిన సేవలకుగాను కాంగ్రెస్ అధిష్టానం అభినందనలు తెలిపింది. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్ పీసీసీ (madhya pradesh) విష‌యంలో హైక‌మాండ్ కొన్ని రోజులు క్రితం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అన్న సిద్ధాంతాన్ని తెర‌పైకి తెచ్చింది. ఈ కార‌ణంగానే క‌మ‌ల్‌నాథ్ రాజీనామా చేశార‌ని మధ్యప్రదేశ్‌లో చర్చ జరుగుతోంది.