పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్ పటేల్ కి చేదు అనుభవం ఎదురైంది.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్న హార్దిక్ పై ఓ వ్యక్తి దాడి చేశారు. అందరూ చూస్తుండగా స్టేజీ పైకి ఎక్కి హార్దిక్ చెంప పగలకొట్టాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... గుజరాత్ లోని సురేంద్రనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ సహా రాష్ట్రంలోని పలువరు కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా హార్దిక్ పటేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి వేదికపైకి ఎక్కి హార్దిక్ చెంప పగలకొట్టారు.

హార్ధిక్ పై అరుస్తూ అక్కడి నుంచి నెట్టేశాడు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతనిని పట్టుకొని చితకబాదారు. కార్యకర్తల దాడిలో అతని దుస్తులు కూడా చిరిగిపోయాయి. తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతనిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించి.. అనంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.