జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధోవల్ నడిరోడ్డుపై సాధారణ పౌరులతో కలిసి భోజనం చేస్తున్న వీడియోను ఉద్దేశిస్తూ ఆజాద్ విమర్శలు చేశారు. ‘‘డబ్బులిచ్చి ఎవర్నైనా వెంట తీసుకెళ్లచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

కాగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో తాజా పరిస్ధితులను సమీక్షించడానికి ఆయన రెండు రోజులు పాటు అక్కడ మకాం వేశారు. ఈ క్రంలో కశ్మీరీలతో మాట్లాడిన ధోవల్.. పరిస్ధితి ఇప్పుడెలా ఉంది.. రాష్ట్ర విభజన గురించి మీరంతా ఏమనుకుంటున్నారు.. వంటి ప్రశ్నలు అడగ్గా కొంతమంది నుంచి అంతా బాగానే వుంది అనే సమాధానం వచ్చింది.

‘‘మీరంతా బావుండాలి.. ప్రశాంతిగా జీవించాలి.. మీ భద్రతే మాకు ముఖ్యం. మీ పిల్లలు బాగుపడేలా పరిస్థితులు మార్చాలని తాము ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాం’’ అని ధోవల్ స్థానికులతో సంభాషించిన వీడియో ఒకటి జాతీయ మీడియాలో ప్రసారమయ్యింది.

అనంతరం షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలతో కూడా ధోవల్ కాసేపు ముచ్చటించి, వారితో మధ్యాహ్న  భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ దేశం సీఆర్పీఎఫ్ పైనే ఆధారపడివుంది. కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను సీఆర్‌పీఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొందని ధోవల్ సైనికుల్లో స్ఫూర్తిని నింపారు.