Asianet News TeluguAsianet News Telugu

బీబీసీ డాక్యుమెంటరీని సపోర్ట్ చేయడం దేశానికే డేంజర్: కాంగ్రెస్ ఏకే ఆంటోనీ కుమారుడి అనూహ్య స్పందన

ఇండియా: ది మోడీ కొశ్చన్ అనే టైటిల్‌తో బీబీసీ తీసిన డాక్యుమెంటరీని బీజేపీ, ఇతర ప్రభుత్వ పక్షాలు ఖండిస్తుండగా కాంగ్రెస్, మరికొన్ని వర్గాలు సమర్థిస్తున్నాయి. దాచేస్తే నిజం దాగదని కాంగ్రెస్ ఈ డాక్యుమెంటరీని పేర్కొంటూ వ్యాఖ్యలు చేస్తుండగానే అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ మాత్రం పార్టీ వైఖరికి విరుద్ధమైన స్టాండ్ తీసుకున్నారు. బీబీసీ డాక్యుమెంటరీని సమర్థించడం ప్రమాదకర పరిణామాలకు దారితీయొచ్చని హెచ్చరికలు చేశారు.
 

congress leader ak antony son slams bbc documentary says placing its views above our institution may undermine our sovereignty
Author
First Published Jan 24, 2023, 7:56 PM IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ అల్లర్లపై బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ బీబీసీ తీసిన వివాదాస్పద డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. కానీ, ఇంటర్నెట్‌లోని పలు మార్గాల్లో ఈ డాక్యుమెంటరీని కొందరు వీక్షిస్తున్నారు. అధికార పక్షాలు ఈ డాక్యుమెంటరీని ఖండిస్తుంటే.. ప్రతిపక్షంలోని కాంగ్రెస్ మాత్రం ఎత్తిపట్టే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ తరుణంలోనే ప్రధాని మోడీకి ఊహించని మద్దతు లభించింది. కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఏకే ఆంటోనీ కుమారుడు, మొన్న మొన్నటి వరకు కేరళ కాంగ్రెస్ యూనిట్ డిజిటల్ కమ్యూనికేషన్స్ బాధ్యతలు నిర్వర్తించిన అనిల్ ఆంటోనీ బీబీసీ డాక్యుమెంటరీని సమర్థించడాన్ని ఖండించారు.

మన దేశ వ్యవస్థలను కాదని, వాటికంటే కూడా బీబీసీ అభిప్రాయాలను ఎత్తిపడితే అది ప్రమాదకర పరిణామాలకు బీజం వేయొచ్చని, అది దేశ సార్వభౌమత్వాన్నే దెబ్బతీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన కొన్ని అభిప్రాయాలనూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్ పై బీబీసీకి సంవత్సరాలుగా ముందుగా ఏర్పరుచుకున్న అభిప్రాయాలు (వాస్తవానికి దూరమైన అభిప్రాయాలు) ఉన్నాయని, ఇరాక్ పై యుద్ధం కుట్రలో మేధోపరమైన సహకారం ఉన్న బీబీసీ అభిప్రాయాలను మన దేశ వ్యవస్థలను(సుప్రీంకోర్టు?) కాదని, నెత్తికెక్కించుకోవడం ప్రమాదకరం అని వివరించారు.

Also Read: గుజరాత్ అల్లర్లు, పీఎం మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. అమెరికా స్పందన ఇదే

బీబీసీ డాక్యుమెంటరీకి సమర్థింపుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన ఈ రోజే అనిల్ కే ఆంటోనీ కూడా తన బలమైన అభిప్రాయాన్ని బహిరంగంగా ట్విట్టర్‌లో వెల్లడించారు.

గుజరాత్‌లో 2002లో అల్లర్లు జరిగాయి. అప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఒక వైపు అల్లర్లు జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం చేష్టలూడిగి కూర్చున్నదనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. కొందరైతే మోడీ ప్రభుత్వమే ఈ అల్లర్ల వెనుక ఉన్నదని ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలు అన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఆరోపణల నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక వైపు సుప్రీంకోర్టు ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర అల్లర్లలో ఎంతమాత్రం లేదని స్పష్టంగా తెలుపగా.. బీబీసీ డాక్యుమెంటరీ మాత్రం తీర్పుకు విరుద్ధమైన అభిప్రాయాలను ఆ డాక్యుమెంటరీలో చేర్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అనిల్ కే ఆంటోనీ మన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని బీబీసీ డాక్యుమెంటరీకి విలువ ఇవ్వడం, దాన్ని సమర్థించడం దేశ సార్వభౌమత్వానికే ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరించారు. బీజేపీతో తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ బీబీసీ డాక్యుమెంటరీని సమర్థించడం సరికాదని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios