కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకీ మరింత అధ్వానంగా తయారైతుంది. గత రెండు రోజులుగా పార్లమెంటులో వారి వ్యవహార శైలిని చూస్తుంటే ఆ పార్టీ ఎంపీలలో నిబద్ధత కొరవడిందనేది సుస్పష్టం. ఏం మాట్లాడుతున్నారో, అది మాట్లాడాలో వద్ధో కూడా తేల్చుకోలేని దయనీయమైన స్థితి. కాంగ్రెస్ పార్టీకంటూ ఒక స్టాండ్ లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీలు చిన్నవైనప్పటికీ వాటికంటూ ఒక స్టాండ్ ఉంది అవి వాటికి కట్టుబడి ఉన్నాయి. కాంగ్రెస్ పరిస్థితేంటో వారికే అర్థం కావాలి. 

ఒక ఎంపీ ఏమో నేను మద్దతు ఇస్తున్నాను అంటాడు, ఇంకొకతను లేదు మా పార్టీ దీనికి వ్యతిరేకం అంటాడు , వారి పార్టీ విప్ భువనేశ్వర్ కలిత ఏకంగా ఆ పదవికి రాజీనామా చేసి నేను పార్టీని ధిక్కరిస్తున్నాను అంటాడు. మొత్తానికి ఈ తమాషానంతటిని చూస్తున్న ప్రజలు మాత్రం ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారు. 

ఇదంతా ఒకెత్తయితే ఆ పార్టీ లోక్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మరో ఎత్తు. అతను 370ఆర్టికల్ పైన మాట్లాడుతూ, ఏది అంతర్గత అంశమో, ఏది ద్వైపాక్షిక అంశమో,ఏది అంతర్జాతీయ అంశమో కూడా తెలుసుకోకుండా మాట్లాడాడు. తను ప్రసింగిస్తుండగా సోనియా గాంధీ మొహంలో ఆగ్రహం కొట్టొచ్చినట్టు కనపడింది. ఎన్నో ఏళ్లుగా నెహ్రు ఇందిరా వంటి గొప్ప గొప్ప నాయకులు ఈ పార్టీ నుంచే వచ్చారా అనే సంశయం మాత్రం కలగక మానదు. 

ఈ సమయంలో కనీసం రాహుల్ గాంధీ అన్నా మాట్లాడాల్సింది. వారి నేతలలో ఎవరూ మాట్లాడలేకపోతున్నప్పుడు అతను మాట్లాడాల్సింది. అందుకోసమే కదా ఒక గెలిచే సీటైన వాయనాడ్ ను అతనికి పార్టీ ఇచ్చింది. ఇప్పుడతను అధ్యక్షుడు కాకపోవచ్చు కానీ కనీసం నిబద్ధత కలిగిన ఒక పార్టీ కార్యకర్తగా కూడా వ్యవహరించలేదు. ప్రస్తుతం లోక్ సభలో వారు పదిశాతం కన్నా తక్కువ సీట్లకు పడిపోయారు. వారి వద్ద మేధావులు లేకపోవచ్చు. కనీసం ఉన్నవారినైనా వాడుకోవడం రావాలి కదా. శశి థరూర్ లాంటి విద్యావంతుడు, ఐక్యరాజసమితిలో పనిచేసిన అనుభవం ఉన్నవాడు, అతనిని గనుక లోక్ సభా పక్ష నేతగా ఎన్నుకొని ఉంటే, కనీసం పార్టీని నవ్వులపాలుకాకుండానన్నా కాపాడేవాడు. 

అధీర్ రంజన్ చౌదరి గొప్ప రాజకీయ నేతే కావచ్చు. మోడీ హవాను కూడా ఎదురొడ్డి గెలిచి ఉండొచ్చు కానీ పరిస్థితులను సరిగా ఆకళింపు చేసుకున్నట్టుగా మాత్రం లేడు. అది అయినా కేవలం అతని ఒక్కడి తప్పు కాదు పూర్తి పార్టీ పరిస్థితే ఆలా ఉంది. అతను కనీసం పూర్తిగా మాట్లాడడానికి సన్నద్ధుడై వచినట్టుగానే కనిపించలేదు. ఈ సమావేశాల్లోనే మోడీ ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో ఎదో ఒకటి తేల్చబోతుంది అనేది జగమెరిగిన సత్యం. మరి ఇది వారికి తెలీదా? తెలుసు కనీసం అప్పుడైనా అందరినీ కూర్చోబెట్టి ఎలా వ్యవహరించాలో చర్చించిన పరిస్థితి కూడా లేదు. 

బిజెపి లాంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీలు అకాడెమీలు పెట్టిమరీ వారి నేతలకు శిక్షణలిస్తున్నాయి . అనేక అంశాలపైన వారి పార్టీ అజెండా ఏంటో వారి నేతలకు కంఠస్థమయ్యేలా తర్ఫీదునిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కనీసం సమావేశాల ముందు కూడా ఇలాంటివి చేయడం లేదు. వీరికి గనుక ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా అసలు షిమ్లా ఒప్పందం ద్వారా ఏది అంతర్గత అంశమో, ఏది ద్వైపాక్షిక అంశమో,ఏది అంతర్జాతీయ అంశమో విభజించింది ఇందిరా గాంధీనే. (అంతర్గతం-కాశ్మీరులో అస్థిరత, ద్వైపాక్షికం- పాక్ ఆక్రమిత కాశ్మీర్, అంతర్జాతీయం- ఎల్ ఓ సి ని గౌరవించి సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపాలని పాకిస్థాన్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడం) ఇవేవి సరిగా తెలియని అతను ఎం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడాడు. 

1950ల్లో ఉన్న 370 వేరు ఇప్పుడున్నది వేరు. క్రమక్రమంగా దాన్ని బలహీనపరుస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు మిగిలింది కేవలం అప్పటి 370 ఛాయా మాత్రమే. ఇవేవి తెలియని ఈ నాయకులు ఏదో బిజెపి అవునన్నది కాబట్టి మేము వ్యతిరేకించాలాల్సిందే అన్నట్టుగా ప్రవర్తించారే తప్ప వాస్తవాలను ఆకళింపు చేసుకొని మాట్లాడినట్టు మాత్రం లేదు. 

ఇప్పటికైనా పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తమాషాలు ఆపి, మంచి లోక్ సభా పక్ష నాయకుడిని ఎన్నుకొని ఎన్నికలకు సన్నద్ధమైతే తప్ప పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితులు కనపడడం లేదు.