ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే అదితి సింగ్ హైకమాండ్ షాకిచ్చింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

రెండు రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. కాగా మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 36 గంటల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది.

అయితే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఈ సమావేశాలను బహిష్కరించాయి. అయినప్పటికీ రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితిసింగ్ ఈ సమావేశాలకు హాజరయ్యారు.

దీనిపై ఏఐసీసీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. కాగా గతంలో జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సైతం ఆమె మద్ధతు ప్రకటించడం అప్పట్లో కలకలం రేపింది.