కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ సునాయసంగా మెజార్టీ మార్క్ దాటేస్తున్నట్టు కనిపిస్తున్నది. జేడీఎస్ గతంలో కంటే తడబడినట్టుగానే ట్రెండ్స్ చెబుతున్నాయి. బీజేపీ కూడా మెజార్టీ మార్క్‌కు దూరంగానే నిలబోతున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్సే కింగ్. కింగ్ మేకర్ జేడీఎస్‌కు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చిందనే చర్చ నడుస్తున్నది.
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ దూసుకుపోతున్నది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. 134 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. బీజేపీ 64 స్థానాలకు, జేడీఎస్ 22 స్థానాలకు పరిమితమైంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి 113 సీట్లు అవసరం. ఈ మార్క్‌ను కాంగ్రెస్ పార్టీ అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నది.
సాధారణంగా కర్ణాటకలో ఒక ప్రత్యేక సాంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌లో బరిలో పోటాపోటీగా ఉంటే.. జేడీఎస్ కొన్ని సీట్లతో ప్రభుత్వంలో భాగమైపోతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన జేడీఎస్‌కు ఆ వెసులుబాటు ఉంటుంది. అవసరమైతే సీఎం సీటును కూడా జేడీఎస్ డిమాండ్ చేస్తుంది. మెజార్టీ మార్క్‌కు కొంత దూరంలోనే మిగిలిపోయిన పార్టీ తప్పక జేడీఎస్ సహాయం కోరుతుంది. ఇలా జేడీఎస్ కింగ్‌మేకర్‌గా పేరొందింది. కానీ, ఈ సారి ఆ కింగ్ మేకర్‌కు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది.
Also Read: ఓటమిని అంగీకరించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. ‘చాలా ప్రయత్నించాం కానీ..’
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. జేడీఎస్ సహాయంతో అధికారాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ చీఫ్ దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి సీఎంగానూ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఆ తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ మధ్యలోనూ పొరపొచ్చాలు వచ్చాయి. కానీ, ఈ సారి కాంగ్రెస్ స్వయంగా మెజార్టీ మార్క్ దాటుతుండటం ఇక్కడ విశేషం. దీంతో కాంగ్రెస్సే స్వయంగా ఇప్పుడు కర్ణాటకలో కింగ్. దానికి కింగ్ మేకర్ జేడీఎస్ సహాయం అవసరం లేదనే టాక్ వినిపిస్తున్నది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాగా, కాంగ్రెస్ 80 సీట్లతో సరిపెట్టుకుంది. జేడీఎస్ 37 సీట్లతో కింగ్ మేకర్‌గా మారింది.
