తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో  నలుగురు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ సభ్యుడు కేకే విశ్వనాథన్, కేపీసీసీ సెక్రటరీ ఎంఎస్ విశ్వనాథన్, డీసీసీ జనరల్ సెక్రటరీ పీకే అనిల్ కుమార్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుజయ వేణుగోపాల్ రెడ్డి పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు.

పార్టీ నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంఎస్ విశ్వనాథన్ ఆరోపించారు. ఈ కారణంగానే తాను పార్టీ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టుగా ఆయన తెలిపారు.పీకే అనిల్ కుమార్ పార్టీని వీడి లోక్‌తాంత్రిక్ జనతాదళ్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె. సుధాకరన్ తో పాటు పలువురు సీనియర్ నేతలను ఆ పార్టీ నాయకత్వం వయనాడ్ కు పంపింది.

వచ్చే నెల 6వ తేదీన కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు రాజీనామాలు చేయడం ఆ పార్టీకి ఇబ్బందికరపరిస్థితులను తెచ్చిపెట్టింది.140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రస్తుతం ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలుపుకొనేందుకు ఎల్డీఎఫ్ ప్రయత్నాలు చేస్తోంది.