కర్ణాటక రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు వెలువడి .. నాలుగు రోజులైనా.. కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగడం లేదు. తదుపతి సీఎం డీకే శివకుమార్..? సిద్ధరామయ్యనా..? అనే మధ్య సస్పెన్స్ కొనసాగుతుండగా మూడో సీఎం అభ్యర్ధిపేరు తెరపైకి వచ్చింది.
కర్ణాటకలో బీజేపీ ని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. అయితే.. మూడు నాలుగు రోజులుగా కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయం బెంగుళూర్ నుండి ఢిల్లీకి చేరింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య సస్పెన్స్ కొనసాగుతుండగా మూడో సీఎం అభ్యర్ధిపేరు తెరపైకి వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జి పరమేశ్వరను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ తన మద్దతుదారులు మంగళవారం భారీ ప్రదర్శన చేపట్టారు. ఫొటోలతో ప్లకార్డులు, బ్యానర్లను పట్టుకుని ప్రదర్శనలు చేశారు. కాబోయే సీఎం పరమేశ్వర అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. దళిత నేతను ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పార్టీ హైకమాండ్ తనను కోరితే.. తాను బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి పరమేశ్వర తెలిపారు. మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా పార్టీకి ఆయన చేసిన సేవ గురించి హైకమాండ్‌కు తెలుసునని, (ముఖ్యమంత్రి) పదవి కోసం జనసమీకరణ చేయాలని భావించడం లేదని అన్నారు. ప్రభుత్వాన్ని నడపాలని హైకమాండ్ నిర్ణయించి నన్ను కోరితే.. ఆ బాధ్యత తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్‌పై నాకు నమ్మకం ఉంది. నాకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. నేను దాదాపు 50 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రచ్చ సృష్టించగలను, కానీ నాకు పార్టీ క్రమశిక్షణ ముఖ్యం. నాలాంటి వాళ్ళు పాటించకపోతే పార్టీలో క్రమశిక్షణ ఉండదు. హైకమాండ్ నాకు బాధ్యతలు అప్పగిస్తే తీసుకుంటాను ’అని చెప్పాను. .
కాగా కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గాను 135 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటికే డీకే శివకుమార్,సిద్ధరామయ్య మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండగా.. సీఎం అభ్యర్ధిగా పరమేశ్వర పేరు తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాలు మరింత ఉత్కంఠ భరితంగా మారాయి.
