New Delhi: కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నెల రోజుల పాటు దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 35 ప్రధాన నగరాల్లో జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ లు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జై భారత్ సత్యాగ్రహం, జాతీయ స్థాయిలో జై భారత్ మహా సత్యాగ్రహం నిర్వహించనున్నారు. 

Congress Plans Month-Long Protests Against Centre: లోక్ సభ నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై జేపీసీ డిమాండ్ పై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై పోరుకు సిద్ధ‌మవుతోంది. బీజేపీ ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా నెల రోజుల పాటు దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 35 ప్రధాన నగరాల్లో జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ లు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జై భారత్ సత్యాగ్రహం, జాతీయ స్థాయిలో జై భారత్ మహా సత్యాగ్రహం నిర్వహించనున్నారు.

ఇదిలావుండ‌గా, ఓబీసీ వర్గాన్ని దూషించినందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ విమ‌ర్శించారు. పార్లమెంటులో ప్రధాని మోడీని రాహుల్ గాంధీ దూషించారని పేర్కొన్నారు. 'ప్రధాని మోడీని అవమానించే ప్రయత్నంలో రాహుల్ గాంధీ మొత్తం ఓబీసీ వర్గాన్ని అవమానించారు. దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలను అవమానించడానికి గాంధీ కుటుంబం ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. మన దేశంలో ఓబీసీ వర్గాన్ని క్షమించమని వేడుకునే వినయాన్ని రాహుల్ గాంధీ పెంపొందించుకోలేకపోయారని, ఇది గాంధీ కుటుంబం అనే రాజకీయ అహంకారానికి నిదర్శనమని" ఆమె అన్నారు.

పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ గత శుక్రవారం లోక్ సభ ఎంపీ పదవికి అనర్హులయ్యారు. బీజేపీ డిమాండ్ పై తాను క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ ఒక రోజు తర్వాత మీడియా సమావేశంలో అన్నారు. తన పేరు సావర్కర్ కాదనీ, తన పేరు గాంధీ అని, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పరని ఆయన అన్నారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నలకు బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు బలప్రదర్శన నిర్వహించారు.

రాహుల్ గాంధీ అనర్హతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సాయంత్రం ఎర్రకోట నుంచి టౌన్ హాల్ వరకు 'లోక్తంత్ర బచావో మషాల్ శాంతి మార్చ్'ను ప్లాన్ చేసింది. నిరసన ర్యాలీకి యత్నించిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నాయకులు చాందినీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ అన్నారు. "మేము మషాల్ మార్చ్ నిర్వహించాలని అనుకున్నాము, కానీ చాలా మంది పోలీసులను మోహరించారు. ప్రజలను అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది. ఈ సమస్యను బ్లాకులు, గ్రామాలకు తీసుకెళ్తాం. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, మనం దానిని రక్షించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. 'దేశంలో ప్రజాస్వామ్యం దుస్థితిని మీరు చూడాలి. శాంతియుతంగా టార్చ్ లైట్ మార్చ్ చేస్తున్నాం. నిన్న మేము పోలీసులు, కమిషనర్లతో చర్చించాము.. దీనికి వారు అంగీకరించారు. ఇవాళ ఎక్కడికక్కడ తమ కార్యకర్తలను అడ్డుకున్నార‌ని" మండిపడ్డారు. అదానీ వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింద‌ని తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 35 ప్రధాన నగరాల్లో జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ లు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జై భారత్ సత్యాగ్రహం, జాతీయ స్థాయిలో జై భారత్ మహా సత్యాగ్రహం నిర్వహించనున్నారు. సంబంధిత అంశాలపై ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ పోస్టుకార్డులు పంపాలని ఆ పార్టీ బహిరంగ ప్రచారం చేసింది.