న్యూడిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కుక్కతో పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులొకరు సంచలన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెంచుకుంటున్న కుక్కే కోహ్లీ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ కామెంట్స్ ద్వారా కోహ్లీకి వ్యతిరేకంగా కాకుండా మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు,  మాజీ ఎంపి ఉదిత్ రాజ్. 

ప్రస్తుత కరోనా సమయంలో దీపావళి పండగను టపాసులు పేల్చకుండా జరుపుకోవాలని విరాట్ దేశప్రజలకు సూచించారు. టపాసులు కాల్చడం వల్ల హానికరమయిన వాయువులు వెలువడటంతో పర్యావరణం మరింత నాశనం అవుతుందని... కాబట్టి దీపావళి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోహ్లీ సోషల్ మీడియా వేదికన పిలుపునిచ్చారు. 

Happy Diwali 2020: టపాకాయలు కాల్చకండి అంటూ విరాట్ కోహ్లీ వీడియో సందేశం...

అయితే కోహ్లీ చేసిన ఈ ప్రకటన ఓ వర్గానికి వ్యతిరేకంగా వున్నాయంటూ సోషల్ మీడియాలో అతడిపై మాటల దాడి మొదలయ్యింది. ''పవిత్రమైన దీపావళి పండగ రోజున టపాసులు కాల్చవద్దంటావా... నువ్వు ఓ కుక్కవి..  నీలాంటి కుక్కల మాటలను మేం పట్టించుకోం'' అంటూ కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్విటర్ వేదికగా కోహ్లీకి మద్దతు తెలిపారు. ''అనుష్క శర్మకు తన కుక్క విరాట్ కోహ్లీని అదుపుచేయాల్సిన అవసరం లేదు. కుక్క కంటే విశ్వాసంగా వుండే జంతువు మరేదీ వుండదు. కోహ్లీపై మీలాంటి లుచ్చా, లఫంగా మరియు మూర్ఖులు వ్యాఖ్యలు మానవత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేలా వున్నాయి. మీరు ఈ దేశ మూలాలు కలిగిన వారో లేదో తెలుసుకోడానికి డిఎన్ఎ పరిక్ష చేయించుకోండి'' అంటూ ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు.