ప్రతిపక్షాల తరుఫున రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే గురువారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే కలిశారు. త్వరలోనే టీఎంసీ, డీఎంకే, శివసేన పార్టీల నాయకులతో భేటీ కానున్నారు. 

రాష్ట్రపతి ఎన్నిక‌ల కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ విప‌క్షాల పార్టీ నుంచి అభ్య‌ర్థిని నిల‌బ‌ట్టాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ వ‌వార్ తో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే తో గురువారం భేటీ అయ్యారు. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. 

ఈ భేటీ సంద‌ర్భంగా మ‌ల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో చ‌ర్చించేందుకు తాను శ‌ర‌ద్ వ‌వార్ తో స‌మావేశం అయ్యాన‌ని తెలిపారు. ఇతర పార్టీలతో మాట్లాడిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి పేరు ఖ‌రారు విష‌యంలో ఆలోచించాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనను కోరారని ఆయ‌న చెప్పారు. త్వ‌ర‌లోనే శివసేన నేత ఉద్ధవ్ థాక్రే, డీఎంకే, టీఎంసీ నేతలను కలుస్తామని తెలిపారు. ఈ భేటీ తేదీ త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తామ‌ని చెప్పారు.

బీజేపీ నేత‌ల‌ను కుక్క‌ల‌తో పోల్చిన సిద్దా రామ‌య్య‌.. వివాదంలో పడిన కర్ణాటక మాజీ సీఎం

కాగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24 న ముగియ‌నుంది. భారత తదుపరి రాష్ట్రపతి ఎన్నిక తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ప్రకటించింది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉంటుంద‌ని, 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో విప‌క్షాల అభ్య‌ర్థి కోసం ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. మ‌రో సారి కూడా బీజేపీ నిల‌బెట్టిన అభ్య‌ర్థే రాష్ట్రప‌తిగా గెలుపొందే అవ‌కాశం ఉంది. అయితే ఆ పార్టీ ఇంకా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. 

పార్లమెంటు ఉభయ సభల్లో ప్ర‌స్తుతం ఉన్న 772 మంది సభ్యుల్లో బీజేపీకి కేవ‌లం 392 మంది ఎంపీలే ఉన్నారు. అంటే ఎలక్టోర‌ల్ కాలేజీలో పార్లమెంటులో బీజేపీకి దాదాపు సగం ఓట్లు ఉన్నాయి. ఇక వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను క‌లుపుకోవ‌డంతో పాటు మిత్ర‌ప‌క్షాల మ‌ద్ద‌తు ఉండ‌టం వ‌ల్ల ఆ పార్టీ ప్ర‌తిప‌క్షాల కంటే ముందే ఉండే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం లోక్ సభలో మూడు, రాజ్యసభలో 13 ఖాళీలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈ ఖాళీలు బీజేపీ అభ్య‌ర్థి విజ‌యంపై ప్ర‌భావం చూపించక‌పోవ‌చ్చు. ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిలో కాషాయ‌పార్టీ విజ‌యం సాధించ‌డంతో బీజేపీ బ‌లం కూడా మెరుగుపడింది. కాగా యూపీలో ఆ పార్టీ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ..గ‌త సారితో పోలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య త‌గ్గింది. 

Sidhu Moose Wala murder : సిద్ధూ మూస్ వాలా హత్య కేసు.. గోల్డీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

ఎలక్టోరల్ కాలేజీలో అధికార ఎన్డీయేకు ఇప్పటికే 50 శాతం ఓట్లు ఉన్నాయని ఓ బీజేపీ నాయ‌కుడు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. అలాగే తమకు ఏపీలో అధికార ప‌క్షంగా ఉన్న వైసీపీ, ఒడిశా కు చెందిన బీజేడీ వంటి స్వతంత్ర ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ఈ కూటమి ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే బీజేపీ తన కూటమి భాగస్వామి పక్షమైన ఏఐఏడీఎంకే మద్దతును కూడా పొందుతోంది. కాగా రాష్ట్రపతి కోవింద్ 2017 జూలై 25వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో ఆయన బీహార్ గవర్నర్ గా ఉన్నారు. ప్రతిపక్షాలు మీరా కుమార్ ను తమ అభ్యర్థిగా నిలబెట్టాయి. అయితే కోవింద్ 65.65 శాతం ఓట్లతో విజయం సాధించగా, మీరా కుమార్ కు కేవలం 34.35 శాతం ఓట్లు మాత్రమే ద‌క్కాయి.