కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో మేధోమథనం నిర్వహించాలని నిర్ణయించింది ఆ పార్టీ అధినాయకత్వం. కాంగ్రెస్ వ్యవహారాల పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా వున్న నేతలతో సోనియా గాంధీ భేటీ అయ్యారు.

పార్టీ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా వున్నానని ప్రకటించారు రాహుల్ గాంధీ. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. పార్టీ తీరుపై సీనియర్ నేతలు చాలా కాలంగా అసంతృప్తితో వున్నారు.

ఒకరిద్దరు బహిరంగంగానే పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అసంతృప్త నేతలతో పాటు సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

దాదాపు ఐదు గంటల పాటు సాగిన సమావేశంలో 19 మంది నాయకుల అభిప్రాయాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సూచనలు, సలహాలు స్వీకరించారు సోనియా. కాగా 10 జన్‌పథ్‌లో జరిగిన సమావేశానికి సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక , అసంతృప్త నేతలు తదితరులు హాజరయ్యారు.

ఈ ఏడాది ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు పార్టీ పరిస్ధితులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హైకమాండ్‌కు లేఖ రాశారు. పార్టీని అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలని అందులో కోరారు.