కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలు.. భారత్ జోడో యాత్ర రెండో విడత ఉంటుందనే వార్తలకు బలం చేకూర్చినట్టయింది. భారత్ జోడో యాత్ర రెండవ విడతను కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు జైరామ్ రమేష్ ఆదివారం తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల ప్రయాణం తరువాత.. మరో యాత్ర కోసం పార్టీ శ్రేణుల్లో చాలా ఉత్సాహం, శక్తి ఉందని చెప్పారు. 

తూర్పు నుంచి పడమరకు (ఈస్ట్-టు-వెస్ట్) యాత్ర ఉంటుందని.. బహుశా అరుణాచల్ ప్రదేశ్ లోని పసిఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్‌బందర్ వరకు సాగే అవకాశం ఉందని తెలిపారు. అయితే రెండో విడత యాత్ర ఆకృతి భారత్ జోడో యాత్ర తొలి విడతతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పారు. ‘‘చాలా ఉత్సాహం, శక్తి ఉంది. వ్యక్తిగతంగా ఇది అవసరమని నేను కూడా అనుకుంటున్నాను. కానీ తూర్పు-పడమర యాత్ర యొక్క ఫార్మాట్ సౌత్-టు-నార్త్ భారత్ జోడో యాత్ర ఆకృతికి భిన్నంగా ఉంటుంది’’ అని రమేష్ అన్నారు.

భారత్ జోడో యాత్ర కోసం సమీకరించబడిన అటువంటి విస్తృతమైన మౌలిక సదుపాయాలు.. రెండో విడతలో ఉండకపోవచ్చని, తక్కువ యాత్రికులు ఉండవచ్చని అని జైరామ్ రమేష్ అన్నారు. ఈ మార్గంలో నదులు, ఆరణ్యాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అధిక భాగం పాదయాత్ర మోడ్‌లోనే కొనసాగుతుందని చెప్పారు. ‘‘ఇది మల్టీ-మోడల్ యాత్ర అవుతుంది.. కానీ ఎక్కువగా ఇది పాదయాత్రగా నిలుస్తుంది’’ అని జైరామ్ రమేష్ అన్నారు. 

ఏప్రిల్‌లో కర్ణాటకలో ఎన్నికలు, జూన్ నుండి వర్షాలు, నవంబర్‌లో మళ్ళీ రాష్ట్ర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. యాత్ర జూన్ కంటే ముందు గానీ, నవంబర్ కంటే ముందు గానీ చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ యాత్ర.. భారత్ జోడో యాత్ర కంటే తక్కువ వ్యవధితో కూడుకుని ఉంటుందని చెప్పారు. రాబోయే కొద్ది వారాల్లో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు జరుగుతాయని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సెషన్‌ను రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. భారత్ జోడో యాత్ర ద్వారా చేపట్టిన ‘‘తపస్య’’ ను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ కొత్త ప్రణాళికను రూపొందించాలని, తాను మొత్తం దేశంతో కలిసి ఇందులో పాల్గొంటానని చెప్పారు.