న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. 

రాహుల్ గాంధీ రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా ఇప్పటికే సీడబ్ల్యూసీ కోరింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 

వచ్చే వారంలో సీడబ్ల్యూసీ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశంలో కొత్త కమిటీలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా పార్టీ బలోపేతంపై చర్చించి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. అనంతరం కొత్తకమిటీలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.