దేశంలో జేఈఈ, నీట్ పరీక్షల వివాదం ముదురుతోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి జరగనున్న నీట్, జేఈఈపై మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కే యోచనలో విపక్షాలు ఉన్నాయి.

తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విపక్ష పార్టీల ముఖ్యమంత్రులపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సందర్భంగా తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరీక్షల నిర్వహణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

పరీక్షలను వాయిదా వేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామని ఆమె సూచించారు. నీట్, జేఈఈని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే హాజరయ్యారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పాలిత సీఎం పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రులు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శించారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరోవైపు నీట్‌ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయని రాహుల్‌ గాంధీ అన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్‌ పరీక్ష నిర్వహించడం సరికాదని రాహుల్‌ పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే సుబ్రమణ్య స్వామి, రాహుల్ గాంధీ, ఆదిత్య థాక్రే, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌లు కేంద్రానికి లేఖ రాశారు. అటు బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా పరీక్షలను వ్యతిరేకిస్తూ విద్యార్ధుల తరపున మద్ధతు ప్రకటించారు.