Raipur: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మరోసారి విమ్శలు గుప్పించిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. 2024లో ప్రజావ్యతిరేక బీజేపీని ఓడించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ 85వ ప్లీనరీలో పేర్కొన్నారు.
Congress President Mallikarjun Kharge: రానున్న లోక్ సభ ఎన్నికలు, కాంగ్రెస్ పొత్తుల గురించి ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ప్రజావ్యతిరేక బీజేపీని ఓడించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ 85వ ప్లీనరీలో పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. లక్ష్య సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలపై నిరంతర దాడి, చైనాతో సరిహద్దులో జాతీయ భద్రత సమస్యలు, గరిష్ట స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయిలో నిరుద్యోగం వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోందని కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సమర్థమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
తనను తాను ప్రధాన సేవకుడిగా చెప్పుకునే వ్యక్తి (ప్రధాని మోడీ) తన స్నేహితుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. భారత్ లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం అందరినీ ఏకం చేసేందుకు కృషి చేస్తోంది: మల్లికార్జున ఖర్గే
2004 నుంచి 2014 వరకు భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి దేశ ప్రజలకు సేవలందించిందన్నారు. ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి భావసారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మరోసారి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని ఖర్గే తెలిపారు. దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, రాబోయే వివిధ రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల క్రమంలో తమ లక్ష్యం కోసం అవసరమైన అన్ని త్యాగాలు చేస్తామని చెప్పారు.
ఢిల్లీలో కూర్చున్న వారి డీఎన్ఏ పేదలకు వ్యతిరేకమనీ, వారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దేశంలో నెలకొన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టాలంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ప్లీనరీ సమావేశాలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసిందని కూడా ఆయన ఆరోపించారు. తమ కార్యకర్తలను అరెస్టు చేశారు.. అయితే, వాటిని ఎదుర్కొని తాము ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
