సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున్ ఖర్గేను ప్రశ్నించారు.
ఇటీవల సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మతం, రాజకీయాలు వేర్వేరుగా ఉన్నాయని, వాటిని కలపాల్సిన అవసరం లేదని అన్నారు.
ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా థెక్వాలో జరిగిన ‘భరోసే కా సమ్మేళన్’ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. అనంతరం ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించగా.. "తాను ఎవరి మతం గురించి మాట్లాడలేననీ, ఇక్కడికి పేదల కోసం ఉద్దేశించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని అన్నారు. మతం, రాజకీయాలు వేర్వేరు విషయాలు, వాటిని కలపాల్సిన అవసరం లేదనీ, అసలు ఆ అంశంపై చర్చ అక్కరలేదని అన్నారు.
అంతకుముందు రోజు.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి రాజేష్ మునాత్ మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందో ? లేదో ? ఖర్గే స్పష్టం చేయాలని అన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
తమిళనాడు మంత్రి,ఆ రాష్ట్ర సీఎం ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని, నిర్మూలించాలంటూ పిలుపునిచ్చారు. ద్రవిడ మున్నేట్ర కజగం , కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (INDIA)లో భాగంగా ఉన్నాయి.
