Asianet News TeluguAsianet News Telugu

గెలిచాక పార్టీ వీడొద్దు.. విధేయంగా ఉండాలని దేవుళ్ల ముందు ప్రతిజ్ఞలు.. గోవా కాంగ్రెస్ ఆసక్తికర నిర్ణయం

గోవా కాంగ్రెస్‌ది విచిత్ర పరిస్థితి. మిగితా పార్టీల కంటే కూడా ఎక్కువ మంది స్థానాలను గెలుచుకుంటున్నది. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నది. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచినవారు వేరే పార్టీలోకి చేరిపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. ఇప్పుడు కేవలం ఇద్దరే మిగిలారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులతో పార్టీ మారబోమని దేవుళ్ల ముందు శపథం చేయిస్తున్నది.

congress candidates pledges before god to not defect
Author
New Delhi, First Published Jan 23, 2022, 4:33 PM IST

పనాజీ: గోవా గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిన కాంగ్రెస్‌లో చివరకు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. గోవాలో అసెంబ్లీలో 40 స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందులో నుంచి 17 స్థానాల్లో విజయంఢంక మోగించింది. మిగతా ఏ పార్టీల కంటే కూడా అధిక సీట్లను గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కానీ, ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన 17 మంది ఎమ్మెల్యేలు ఆఖరుకు ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. కాగా, బీజేపీలో ప్రస్తుతం 27 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే విషయమై విపక్షాల నుంచీ విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఓటు వేసినా.. బీజేపీకి వేసినా ఒకటే అని విమర్శలు వినపడుతున్నాయి. బీజేపీకి.. కాంగ్రెస్ ఒక ఆశాభావమని, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్నదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థులందరితో భిన్న మతాల ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి ప్రతిజ్ఞలు చేయించారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన తర్వాత కనీసం ఐదేళ్లు పార్టీలోనే కొనసాగుతామని వారు ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు విధేయంగా ఉంటామని వాగ్దానం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గోవాలోని మహాలక్ష్మీ టెంపుల్, బాంబోలిమ్ చర్చి, హంజా షా దర్గాలను వారు సందర్శించారు. పనాజీలోని మహాలక్షీ ఆలయంలోని పూజారి, కొంకణిలోని బాంబోలిమ్ చర్చిలోని మత గురువు వారితో ప్రతిజ్ఞలు చేయించారు. బేటిమ్‌లోని మసీదులో చాదర్ సమర్పించి పూజలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పీ చిదంబరం, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గోవా డెస్క్ ఇంచార్జీ దినేశ్ గుండు రావు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గిరీష్ చోదంకార్ సహా పలువురు నేతలు 34 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఈ ఆలయాలకు తీసుకెళ్లి ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజల మనసుల కాంగ్రెస్ అభ్యర్థులపై మళ్లీ విశ్వాసం తెప్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చోదంకార్ వివరించారు. అందుకే దైవం ముందు అభ్యర్థులతో శపథం చేయించామని తెలిపారు. ప్రజల మనస్సుల్లోని అన్ని రకాల సంశయాలను తొలగించాలని భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీరియస్‌గా ఉన్నదని పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. తమ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెడుతున్న పార్టీల పట్ల కఠిన వైఖరి అవలంభించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

కాగా, గోవాలో గ‌త ఐదేండ్ల‌లో ఏకంగా 60 శాతం ఎమ్మెల్యేలు పార్టీలు మారార‌ని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 40 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం బలంలో 60 శాతం ఉన్న గోవాలో 24 మంది శాసనసభ్యులు గత ఐదేళ్లలో పార్టీ మారారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది. దీంతో భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త‌ రికార్డును గోవా నెలకొల్పిందని ఏడీఆర్ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios