కాంగ్రెస్ పార్టీ ధరల పెంపుపై కొత్త తరహా నిరసనకు పిలుపు ఇచ్చింది ఈ నెల 31వ తేదీన ఉదయం 11 గంటలకు అందరూ తమ ఇళ్ల ముందుకు వచ్చి గంటలు మోగించాలని, డ్రమ్స్ వాయించాలని కోరింది. తద్వారా ప్రజా సమస్యలను వినడం విస్మరించిన కేంద్ర ప్రభుత్వాన్ని మేలుకొల్పాలని పేర్కొంది. ఈ జనాందోళనలో అందరూ పాల్గొనాలని తెలిపింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై మరో తరహా నిరసనకు పిలుపు ఇచ్చింది. ధరల పెరుగుదులకు ముకుతాడు వేయాలని, చెవిటి తనం ఆవరించిన ఈ కేంద్ర ప్రభుత్వానికి వినిపించేలా శబ్దాలు చేయాలని పేర్కొంది. కాబట్టి, ఈ నెనల 31వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట గంటలు మోగించాలని, డ్రమ్స్ వాయించాలని, మరే పరికరాల ద్వారానైనా శబ్దాలు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పిలుపు ఇచ్చారు.
సాధారణ ప్రజల జేబుకు కేంద్ర ప్రభుత్వం చిల్లు పెడుతున్నదని, వారి నుంచి కోట్ల రూపాయలను బలవంతంగా లాక్కుంటున్నదని ఆయన పేర్కొన్నారు. సాధారణ ప్రజల నుంచి డబ్బు గుంజుకుని ఖజానా నింపుకుంటున్నదని ఆరోపించారు. ఒక వైపు సాధారణ ప్రజల ఆదాయాలను తగ్గించడమే కాదు.. మరో వైపు అధిక ధరల భారాన్ని సామాన్యులపై
మోపుతున్నదని పేర్కొన్నారు. ఒక వైపు తమ ఆప్తులు జీవన్మరణ సమస్యలో చిక్కుకున్నప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు చప్పుళ్లు చేయమని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చిందని, అలా చప్పుడు చేయడం ద్వారా తమ ఆప్తులు గండం నుంచి గట్టెక్కుతారా? అని ప్రశ్నించారు.
కానీ, ఇప్పుడు ధరలను పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వానికి తమ గళాలను వినిపించాల్సిన అవసరం ఉన్నదని, తమ సమస్యలు వినడానికి మొద్దు నిద్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల్లో మూడు రోజులూ పెట్రోల్ రేట్లు పెరిగాయని, డీజిల్ రేట్లు పెరిగాయని అన్నారు. ఎన్నికలు ముగియగానే మళ్లీ చమురు ధరల పెంపును బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నదని విమర్శించారు. అందుకే ధరల పెంపు రహిత భారత్ కోసం ఒక జనాందోళనకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతున్నదని వివరించారు. ఇది కాంగ్రెస్ ఆందోళన కాదని, ఇది ప్రజా ఆందోళన అని తెలిపారు. కాబట్టి, కాంగ్రెస్ ప్రతి నేత, కార్యకర్త, ఓటర్లు తప్పకుండా ఇందులో పాల్గొనాలని, అంతేకాదు, కాంగ్రెస్ ఆలోచనలతో విభేదించేవారు సైతం ఈ నిరసనలో పాల్గొనాలని సూచించారు. ఎందుకంటే.. ఇది కాంగ్రెస్ పార్టీ ఆందోళన కాదని, ప్రజా ప్రయోజనాల కోసం చేపడుతన్న జనాందోళన అని వివరించారు.
