న్యూఢిల్లీ:సోనియాగాంధీకే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పగ్గాలు అప్పగించారు. రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సీడబ్ల్యూసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోనియాగాంధీ వైపుకు మొగ్గు చూపింది. రాహుల్ రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించింది.

కొత్త అథ్యక్షుడి ఎంపిక విషయమై పార్టీ నేతలతో సీడబ్ల్యూసీ సుధీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాతే ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ తీసుకొంది. 20 మాసాల తర్వాత సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకొన్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.

ఎఐసీసీ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే వరకు కూడ సోనియాగాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతారు. తమ కుటుంబేతరులను పార్టీ అద్యక్షులుగా ఎన్నుకోవాలని రాహుల్ చేసిన సూచనను సీడబ్ల్యూసీ ప్రస్తుతం పక్కన పెట్టింది.


ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది.దీంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు సీడబ్ల్యూసీ శనివారం నాడు సమావేశమైంది.రాజీనామాను వెనక్కు తీసుకొనేందుకు రాహుల్ ఒప్పుకోని కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకొంది.

రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేలా ఒప్పించాలని ప్రియాంక గాంధీని కూడ కొందరు నేతలు కోరారు. ఆ ప్రయత్నాలు కూడ సఫలం కాలేదు. దీంతో చివరకు నేతలు సోనియాగాంధీ వైపు మొగ్గు చూపారు.