Indore: కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ, కమల్ నాథ్ లపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
BJP files complaint against Priyanka Gandhi: మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై 50 శాతం కమీషన్ కుంభకోణం అంటూ తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఇండోర్ లీగల్ సెల్ కన్వీనర్ నిమేష్ పాఠక్ ఫిర్యాదు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై ఐపీసీ సెక్షన్ 420, 469 కింద కేసు నమోదు చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్, కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి పోస్టులు చేశారని ఆరోపిస్తూ ఇండోర్ లోని బీజేపీ నాయకుడు శనివారం రాత్రి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఇండోర్, రేవా సహా పలు నగరాల్లో బీజేపీ నేతలు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.
బీజేపీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా ఫేక్ లెటర్ ఆధారంగా సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వి.డి.శర్మతో సహా రాష్ట్ర బీజేపీ నాయకులు నకిలీ లేఖ ఆధారంగా కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేసిందనీ, బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ముందస్తు ప్రణాళికాబద్ధ ఎజెండాలో భాగమని ఆరోపించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం కమీషన్ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు శుక్రవారం నుంచి ఇలాంటి పోస్టుల ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
50 శాతం కమీషన్ చెల్లిస్తేనే తమకు డబ్బులు వస్తున్నాయని మధ్యప్రదేశ్ కు చెందిన కాంట్రాక్టర్ల సంఘం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కర్ణాటకలోని అవినీతి బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ వసూలు చేసేదనీ, మధ్యప్రదేశ్ లో బీజేపీ తన అవినీతి రికార్డును తానే బద్దలు కొట్టిందనీ, కర్ణాటక ప్రజలు 40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని గద్దె దించారని, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రజలు 50 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సోషల్ మీడియాలో ఉదహరిస్తున్న సంబంధిత లేఖ గురించి గ్వాలియర్ లో పరిశీలించామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
'ఆరోపణలు ఎదుర్కొంటున్న లేఖను మెయిల్ చేసిన చిరునామా గానీ, పంపిన వ్యక్తి, దానిని పంపిన అసోసియేషన్ గానీ క్షేత్రస్థాయిలో లేవు. దీన్ని బట్టి ఆ లేఖ ఫేక్ అని స్పష్టమవుతోంది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ తెలిపారు. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికార బీజేపీ నేతలు హెచ్చరించినప్పటికీ తాము చట్టపరమైన చర్యలకు, అరెస్టులకు భయపడేది లేదని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ కేకే మిశ్రా స్పష్టం చేశారు. "అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను, కానీ మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతిని మేము బహిర్గతం చేస్తూనే ఉంటాము. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన పార్టీ 'భ్రష్టచార్ భారత్ ఛోడో' అనే నినాదం ఇస్తుండగా, మరోవైపు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిపై ఆయన మౌనంగా ఉన్నారు" అని ఆరోపించారు.
