Jaipur: రాజస్థాన్ లో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్, బీజేపీలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయనీ, ఏళ్ల తరబడి ప్రజలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు.
Delhi chief minister Arvind Kejriwal: కాంగ్రెస్, బీజేపీలు రాజస్థాన్ ను దోచుకున్నాయనీ, ఏళ్ల తరబడి ప్రజలను మోసం చేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో కలిసి జైపూర్ లోని సంగనేరి గేట్ నుంచి అజ్మీరీ గేట్ వరకు ఆప్ తిరంగా యాత్రకు కేజ్రీవాల్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేశారు.
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడిన కేజ్రీవాల్.. ఆ రెండు జాతీయ పార్టీలను తోబుట్టువులుగా అభివర్ణించారు. బీజేపీ, కాంగ్రెస్ లు అన్నదమ్ముల లాంటివన్నారు. వీరిద్దరి మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయనీ, ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజేలు స్నేహితులనీ, వారు ఎప్పటికప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నారని అన్నారు. అయితే, రాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.
"వసుంధర రాజే, అశోక్ గెహ్లాట్ మంచి స్నేహితులని విన్నాను. గెహ్లాట్ కు ఏదైనా జరిగితే రాజేకు బీజేపీ మద్దతు లభిస్తుంది. రాజేను బీజేపీ గద్దె దించుతుందనే ప్రచారం జరిగినప్పుడు గెహ్లాట్ ఆమెకు మద్దతుగా నిలిచారు. వారిద్దరు ఒకే రకమైన నాయకులు.. వారిద్దరిదీ ఒకే పార్టీ" అంటూ విమర్శలు గుప్పించారు. పేదలకు మంచి విద్యను అందించడానికి ప్రయత్నించినందుకు ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇటీవల అరెస్టు చేశారనీ, దీనిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర బీజేపీ సర్కారు నడుచుకుంటున్న తీరును కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఢిల్లీలో పాఠశాలలను మెరుగుపరుస్తూ పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నందునే బీజేపీ సిసోడియాను జైలుకు పంపిందన్నారు. పేదలకు విద్యా, వైద్యం అందుతుండటాన్ని సహించలేని బీజేపీ ఆయనను జైలుకు పంపిందని ఆరోపించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అలాగే, ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 9న ఆయనను అరెస్టు చేసింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం (కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం) నినాదాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. "కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 20 శాతం కమీషన్ ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక 40 శాతం కమీషన్ వచ్చింది. బీజేపీ డబుల్ ఇంజిన్ అని చెబుతుంటే అవి డబుల్ కమీషన్ అని అర్థం చేసుకోవాలంటూ" విమర్శలు గుప్పించారు. స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు, కరెంట్ కావాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. రాష్ట్ర ప్రజలు ఆప్ కు ఓటువేయాలని కోరారు. 'ఇది నా పోరాటం కాదు... సిసోడియాది కాదు.. కేజ్రీవాల్ ది కాదు.. ఇది మీ పోరాటం. రాష్ట్రంలోని మురికిని తుడిచెయ్యడానికి మీరు చీపురును పట్టాల్సిన సమయం ఆసన్నమైంది' అని మాన్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం మాత్రమే పోరాడతాయి తప్ప అభివృద్ధిపై ఆసక్తి చూపడం లేదని మాన్ ఆరోపించారు.
