కాంగ్రెస్ పార్టీకి దేశానికి మధ్యం దూరం పెరిగిందని పార్టీ సీనియర్ నేత, ఎంపీ మనీష్ తివారీ అన్నారు. దేశం, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకే తీరు ఆలోచించడం లేదని వివరించారు. అలాగే, గులాం నబీ ఆజాద్ రాజీనామాపై చేస్తున్న విమర్శలనూ ఆయన తృణీకరించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ మనీష్ తివారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడుకొచ్చారు. గులాం నబీ ఆజాద్ రాజీనామాపై వ్యాఖ్యానించడానికి నిరాకరించినా.. పార్టీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 

గులాం నబీ ఆజాద్ రాజీనామా లేఖపై స్పందించడానికి ఆయన తిరస్కరించారు. ఆ లేఖ బహిరంగంగానే ఉన్నదని, దాని గురించి ప్రత్యేకంగా తాను చెప్పాలని భావించడం లేదని వివరించారు. ఆ లేఖలోని వ్యాఖ్యలు ఎందుకు, ఏ నేపథ్యంలో ప్రస్తావించారో కేవలం ఆయన మాత్రమే వివరించగలరని పేర్కొన్నారు. కానీ, గులాం నబీ ఆజాద్ విమర్శనాత్మక రాజీనామా లేఖపై కాంగ్రెస్ విమర్శలపై స్పందించారు. ఆ విమర్శలు హాస్యాస్పదం అని పేర్కొన్నారు. కనీసం వార్డు ఎన్నికల్లో కూడా గెలిచే సామర్థ్యం లేని కొందరు.. నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలకు ఛప్రాసీలుగా ఉన్న కొందరు ఇప్పుడు సడెన్‌గా పార్టీ గురించి జ్ఞానాన్ని పంచుతుండటం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. మరే సరైన పదం లేక.. కేవలం హాస్యాస్పదం అనే పదానికి పరిమితం అవుతున్నట్టు విమర్శించారు.

నిజమే.. ప్రస్తుతం తాము సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని ఆయన అన్నారు. ఏదైతే జరిగిందో అది బాధాకరం అని, దురదృష్టకరం అని వివరించారు. తన అంచనాల ప్రకారం.. అవి నివారించగలిగినవని తెలిపారు.

కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన చేయాలని, ప్రస్తుతం పార్టీ దారుణ స్థితిలో ఉన్నదని 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఓ లేఖను సోనియా గాంధీకి రాశారు. వారినే గ్రూప్ ఆఫ్ 23 అని వ్యవహరిస్తుంటారు. ఈ లేఖ రెండేళ్ల క్రితం రాశారు. ఈ లేఖ రాసినప్పటి నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్ పరాజయం పాలైందని మనీష్ తివారీ అన్నారు.

రెండేళ్ల క్రితం ఆ లేఖ రాసిన 23 మందిలో గులాం నబీ ఆజాద్‌తోపాటు మనీష్ తివారీ కూడా ఉన్నారు.

కాంగ్రెస్, భారత్ రెండూ ఒకే లాంటివని చెబుతుంటారని ఆయన తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ రెండు ఒకేలా ఆలోచించడం లేదని వివరించారు. 1885 నుంచి కాంగ్రెస్, దేశం సమన్వయంలో ఉండేవని, కానీ, ఇప్పుడు ఆ సమన్వయం దెబ్బతిన్నట్టు అర్థం అవుతున్నదని తెలిపారు. దేశానికి, పార్టీకి మధ్య దూరం పెరిగిందని అన్నారు. అందుకే ఓ అంతర్మథనం అవసరం అని అభిప్రాయపడ్డారు. 

42 ఏళ్లుగా తాను కాంగ్రెస్ మనిషినే అని వివరించారు. తనకు ఇతరుల సర్టిఫికేట్ ఏమీ అక్కరలేదని తెలిపారు. తాను 42 ఏళ్లు ఈ పార్టీ కోసం ఇచ్చానని చెప్పారు. తాము కాంగ్రెస్‌కు అద్దెగా ఉండట్లేదని, తాము ఈ సంస్థ సభ్యులం అని అన్నారు. ఒక వేళ ఇప్పుడు తనను బయటకు నెట్టేస్తామంటే.. అది వేరే సంగతి అంటూ వివరించారు.