బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మంత్రి మోడీ హెలికాప్టర్ నుండి ఒక నల్ల ట్రంక్ పెట్టెలో ఏముందనే విషయమై విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు  ఏప్రిల్ 12 వతేదీన  కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గకు చేరుకొన్నారు. మోడీ హెలికాప్టర్ ల్యాండైన వెంటనే  హెలికాప్టర్ నుండి నల్లని ట్రంక్ పెట్టెను  సమీపంలోనే నిలిపివన ఉన్న కారులో తరలించారు. ఈ పెట్టెను కారులో పెట్టగానే ఆ కారు వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయింది.

ఈ పెట్టెలో మోడీ నగదును తరలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై విచారణ నిర్వహించాలని కూడ ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది.  పెట్టెను తరలించిన కారు మోడీ కాన్వాయ్‌లోని కారు కాదని కూడ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించారు.

ఈ పెట్టెలో ఏముందనే విషయమై మోడీ నోరు విప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై విచారణ జరిపించాలని కూడ కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది.

మరోవైపు ఈ పెట్టెలో టెలిఫ్రాంటర్‌తో పాటు  పార్టీ లోగోలు, ఇతర ప్రచార సామాగ్రి  కూడ ఉందని కర్ణాటకకు చెందిన చిత్రదుర్గ బీజేపీ అధ్యక్షుడు నవీన్ కుమార్ ప్రకటించారు. పీఎం కాన్వాయ్‌లోనే ఈ కారు ఉందని ఆయన గుర్తు చేశారు.  కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని  ఆయన ప్రకటించారు.