వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఓటర్లను ఆకర్శించేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో హిందూ ఉత్సవాలను కూడా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించింది.
మధ్యప్రదేశ్ లో వచ్చే ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా హిందూ ఓటర్ల మనస్సులను తమ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్రాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో హిందూ ఉత్సవాలైన శ్రీరామ నవమి, హనుమాన్ జయంతిలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రెండు వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు, ప్రార్థనలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ హైకమాండ్ తన యూనిట్ లను కోరింది.
అధికార బీజేపీ రామ నవమిని చిత్రకూట్, ఓర్చా వంటి మతపరమైన ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో జరుపుకుంటోంది. రాష్ట్రంలోని ప్రతి రామ మందిరంలో మట్టి దీపాలు వెలిగించనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ తన బ్లాక్-లెవల్ యూనిట్లన్నింటికీ రామనవమి రోజున రామ్ కథ పారాయణం, రామ్ లీలా అమలు వంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతూ సందేశాలు పంపింది. హనుమాన్ జయంతి సందర్భంగా సుందరాకాండ, హనుమాన్ చాలీసా పఠనాలు చదవాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చంద్రప్రభాష్ శేఖర్ పంపించిన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా రామ్ నవమిపై సందేశాన్ని జారీ చేయనున్నారు. దీంతో పాటు చింద్వారాలో హనుమాన్ జయంతి సందర్భంగా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అయితే కాంగ్రెస్ చేపట్టాలనుకుంటున్న ఈ కార్యక్రమాలను అధికార బీజేపీ విమర్శించింది. ఈ చర్యను ‘‘వంచన’’ అని ఎగతాళి చేసింది. కాంగ్రెస్ నాయకులు రాముడిని ఊహాజనిత పాత్రగా అభివర్ణించారని ప్రకటించారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొందరు ఈ కార్యాచరణను విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన భోపాల్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పంపించిన లేఖపై స్పందిస్తూ.. ‘‘ మా పార్టీ తన యూనిట్లన్నింటికీ ఏ కమ్యూనిటీ పండుగలు జరుపుకోవాలో ఆదేశాలు జారీ చేసే ఈ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏమిటి? రంజాన్ వేడుకలు, గుడ్ ఫ్రైడే. ఈస్టర్ లకు కూడా వేడుకల కోసం ఇలాంటి లేఖలు ఎందుకు జారీ చేయడం లేదు. ’’ అని ప్రశ్నించారు.
ఇలాంటి లేఖలు జారీ చేయడం ద్వారా అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకునేందుకు కాంగ్రెస్ మందుగుండు సామగ్రిని అందజేస్తోందన్నారు. ఒక కమ్యూనిటీ పండుగలను జరుపుకోవడానికి మొగ్గు చూపుతున్న ఇలాంటి పరిణామాలు మైనారిటీలను బాధపెడతాయి అని ఆయన అన్నారు.
అయితే కాంగ్రెస్ నేతలు గుడికి వెళ్తున్నారంటే ఇది అచ్చే దిన్ తప్ప మరొకటి కాదని.. ఆ పార్టీ నేతలు వీటిని నిర్వహించడాన్ని ఎమ్మెల్యే మసూద్ జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ సీనియర్ నేత, హోంమంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. ఇఫ్తార్ పార్టీలు ఇప్పుడు దేవాలయాలను సందర్శిస్తున్నాయని అన్నారు.
