చేసేదే పాడు పని.. దాని ద్వారా వచ్చిన సొమ్ము కోసం మళ్లీ కొట్లాట. చివరకు.. ఈ కొట్లాటలో ఓ యువడి ఒంటిపై కిరోసిన్ కూడా పోసి నిప్పు అంటించారు. ఈ  సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలోని స్థానిక అశోక్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యువకుడు కాలిన గాయాలతో పడి కనిపించాడు. గమనించిన స్థానికులు వెంటనే స్థానికులకు సమాచారం అందించగా.. పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. వారి విచారణలో కాలిన గాయాలతో ఉన్న యువకుడు ఢిల్లీకి చెందిన దీపక్ గా గుర్తించారు. అతను టీ నగర్ లోని రెడీమేడ్ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందని దీపక్ ని అడగగా.. వంట చేస్తుండగా కాలిందని చెప్పాడు.

 అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అతని శరీరంలో గాయాలున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. దీంతో అనుమానించిన పోలీసులు, అతని గదిని తనిఖీ చేయగా, రక్తపు మరకలతో ఉన్న కత్తి, కిరోసిన్‌ క్యాన్‌ను గుర్తించారు. అనంతరం దీపక్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ను పరిశీలించగా, ఘటన జరగడానికి ముందు అతను రెండు నెంబర్లతో మాట్లాడినట్టు తెలిసింది. అలాగే, ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిచంగా, ఓ యువతి, యువకుడు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. 

ఈ రెండు నెంబర్లను ట్రేస్‌ చేయగా, చెన్నై విమానాశ్రయం వద్ద సిగ్నల్స్‌ లభించాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఢిల్లీకి చెందిన హేమంత్‌, నీల అని, దీపక్‌తో కలసి హేమంత్‌ వ్యాపారం చేస్తున్నాడని, అందులో లాభం లేకపోవడంతో హేమంత్‌ సలహా మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార వృత్తి నడిపి, వారిని రెండు, మూడ్రోజుల్లోనే విమానాల ద్వారా వారిని స్వరాష్ట్రాలకు పంపిస్తుంటారని తేలింది. 

ఇదే క్రమంలో వచ్చిన నీల సంపాదించిన డబ్బును వాటా వేసుకోవడంలో ఘర్షణలు చెలరేగి హేమంత్‌, నీల దీపక్‌ను కత్తితో పొడిచి, కిరోసిన్‌ పోసి తగులబెట్టి, ఇద్దరూ ముంబైకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లారని తేలింది. దీంతో, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.