గుజరాత్ లో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవల వల్ల 65 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి చనిపోయారు. పలు షాపులు దగ్ధమయ్యాయి. 

దేశ వ్యాప్తంగా ఆదివారం శ్రీరామ న‌వ‌మి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. గ‌త రెండేళ్ల నుంచి క‌రోనా వ‌ల్ల ఈ వేడుక‌లు నిరాడంభ‌రంగా చేప‌ట్టారు. అయితే ఇప్పుడు క‌రోనా ప‌రిస్థితులు త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ఈ సారి అంగ‌రంగ వైభవంగా పండ‌గ జ‌రిపారు. ఈ వేడుక‌ల వ‌ల్ల ప‌లు ప్రాంతాల్లో అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. అవి తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీశాయి.

గుజరాత్‌లోని ఖంభాత్ నగరంలోని ఆనంద్ జిల్లాలో ఆదివారం రామనవమి సందర్భంగా చేపట్టిన ఊరేగింపులో మ‌త ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు. ఈ వివ‌రాల‌ను పోలీసులు వెల్ల‌డించారు. ‘‘ రామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు గ్రూపుల మ‌ధ్య ఘర్షణ చెలరేగింది, దీంతో రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు రాళ్లతో రువ్వుకున్నాయి. అయితే ఘ‌ట‌న‌లో ఒక‌రు చ‌నిపోయారు. ఖంభాట్ ప్రాంతంలో సుమారు 65 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం’’ అని ఎస్పీ అజిత్ రాజయన్ తెలిపారు.

ఈ ఘటనలోనే మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ అల్ల‌ర్ల స‌మ‌యంలో కొంద‌రు స్థానికంగా ఉండే షాపుల క్యాబిన్ ల‌కు నిప్పు పెట్టారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే పోలీసులు క‌లుగ‌జేసుకొని టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. 

ఇదే రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ సబర్కాంత ప్రాంతంలో రామ‌న‌వ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా హింసాత్మ‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ‘‘ రామ నవమి ఊరేగింపు సందర్భంగా రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి. కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టుకున్నారు. అయితే పోలీసులు క‌లుగ‌జేసుకోవ‌డంతో కొంత సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది" అని సబర్‌కాంత ఎస్పీ విశాల్ వాఘేలా చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో ఆందోళనకారులు నాలుగు టూ వీల‌ర్ల‌కు నిప్పు పెట్టారు. దీంతో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహ‌రించారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్ నగరంలో కూడా ఇలాంటి ఘ‌ట‌నలే చోటు చేసుకున్నాయి. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల వ‌ల్ల పలు చోట్ల వాహనాలు, ఇల్లు దగ్థమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు క‌ర్ఫ్యూ విధించారు. నగరంలో ఎక్కువ మంది గుమిగూడే సమావేశాలు, సభలను నిషేధించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక్క‌డ ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని పోలీసులు తెలిపారు.