Asianet News TeluguAsianet News Telugu

అవిశ్వాసం: అమిత్ షా వ్యూహమే, మోడీ ధీమా ఇదీ...

తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందనే ధీమాతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడానికి దీన్ని అవకాశంగా తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Confident of win, BJP targets more trust from Opposition's no-trust vote

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందనే ధీమాతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడానికి దీన్ని అవకాశంగా తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యూహంలో భాగంగానే అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

శుక్రవారంనాడే అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతిస్తున్నట్లు తెలిపారు. దీంతో తమకు మద్దతు కూడగట్టుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ, డిఎంకె ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. 

బిజెపిపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్న శివసేన అవిశ్వాస తీర్మానం విషయంలో ఎన్డీఎ వైపై ఉంటామని ప్రకటించింది. ఇది బిజెపికి పెద్ద ఊరట. తాము అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి తీరుతామని, తమకు తగినంత బలం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్ అన్నారు. సోనియా గాంధీకి లెక్కలు సరిగా రావని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 

అవిశ్వాస తీర్మానంపై చర్చకు మరో తేదీని ఖరారు చేయాలని తృణమూల్ కాంగ్రెసు కోరింది. భారీ పార్టీ కార్యక్రమం ఉన్నందున శుక్రవారం లోకసభ తమ ఎంపీలు హాజరు కావడం కష్టంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే, తృణమూల్ కాంగ్రెసుకు చెందిన 34 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయడానికి శుక్రవారం ఢిల్లీ వచ్చి, శనివారం తిరిగి కోల్ కత్తాకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

అవిశ్వాసంపై చర్చ జరిగి, దాన్ని ఓడిస్తే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరుగుతాయని, అలా చేయడమే మంచిదని అమిత్ షా భావించినట్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ ఇచ్చే సమాధానం వచ్చే ఎన్నికలకు ప్రచారానికి శ్రీకారంగా ఉండాలని కూడా భావిస్తున్నారు. 

గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తామని అనంతకుమార్ అంటున్నారు. అవిశ్వాస తీర్మానం తమకు మంచి అవకాశమని చెబుతున్నారు. పైగా, తమ సభ్యుల సంఖ్యను బట్టి తమకు మాట్లాడేందుకు కేటాయించే సమయం కూడా ఎక్కువగా ఉంటుందని బిజెపి భావిస్తోంది. 

తమకు 314 మంది సభ్యుల మద్దతు ఉందని బిజెపి చెబుతోంది. అవిశ్వాసాన్ని ఓడించడానికి 268 మంది సభ్యుల బలం సరిపోతుంది. ప్రస్తుతం సభలో 535 మంది సభ్యులున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పరోక్షంగా ఎన్డీఎకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తారని అంటున్నారు. నవీన్ పట్నాయక్ తన వైఖరిని స్పష్టం చేయలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios