ఢిల్లీ మెట్రో ట్రైన్ కోచ్‌లో మహిళలకు మాతమ్రే రిజర్వేషన్ ఉన్న సీట్ల దగ్గర కండోమ్ యాడ్ పోస్టు చేశారు. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఈ యాడ్ పై అభ్యంతరం తెలిపారు. 

న్యూఢిల్లీ: మన సమాజంలో సెక్స్ అండ్ సెక్సువాలిటీ గురించి బహిరంగంగా చర్చించరు. బహిరంగంగా వాటిపై చర్చపై దాదాపు నిషేధం ఉన్నట్టుగానే ఉంటుంది. భారత ట్రెడిషనల్ సొసైటీలో ఇలాంటి నైతిక నిబంధనలు చాలా ఉన్నాయి. కానీ, కొన్ని సార్లు ఊహించని పరిణామం ఎదురవుతుంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగుతుంది. ఇందుకు దృష్టాంతంగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ మెట్రో కోచ్‌లో మహిళలకు మాత్రమే రిజర్వ్ చేసిన సీట్ల దగ్గర కండోమ్ యాడ్ పోస్టర్ వెలిసింది. కండోమ్ యాడ్ ఇలా బహిరంగంగా పోస్టు చేయడాన్నే చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. అదీ మహిళలు మాత్రమే కూర్చునే దగ్గర కనిపించడంతో వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అయింది.

ఓ ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఢిల్లీ మెట్రో.. మీరు ఇంతలా పురోగమించారా? మహిళల సీట్ల దగ్గర కండోమ్ యాడ్ పెట్టారా? మీ తప్పేమీ లేదు. కానీ, మీకు ఓ విషయం తెలియాలి. భారత్ ఎలాంటి దేశమంటే.. టీవీలో మధ్యాహ్నం పూట కండోమ్ యాడ్స్ రావొద్దనే నిబంధనలు ఉన్నాయి. ఒక సారి ఈ యాడ్ వైపు దృష్టి సారించండి’ అని కామెంట్ చేశారు.

Scroll to load tweet…

కాగా, ఇంకొందరు ట్విట్టర్ యూజర్లకు అదేమీ పెద్ద విషయం కానిదిగా కనిపించింది. అంటే.. ఆ పోస్టర్‌లో తప్పేమీ ఉన్నదని ప్రశ్నించారు. ఇంకా ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరిచారు. 

అయితే, పోస్టర్ రభస పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వర్గాలు బుధవారం స్పందించాయి. ఆ యాడ్ చాలా కాలం నాటిదని, ఇప్పుడు అక్కడ లేదని, ఎప్పుడో తొలగించారని వివరించాయి.