Asianet News TeluguAsianet News Telugu

Agnipath: అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం.. ప్రతిపక్షాల నుంచీ మద్దతు

పంజాబ్ అసెంబ్లీలో అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా అందరు చట్టసభ్యులు ఆమోదం తెలిపారు. 
 

condemning agnipath scheme punjab assembly passes resolution
Author
Chandigarh, First Published Jun 30, 2022, 6:09 PM IST

చండీగడ్: అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు కూడా జరిగాయి. తాజాగా, పంజాబ్ అసెంబ్లీ ఈ స్కీంను వ్యతిరేకిస్తూ ఏకంగా ఓ తీర్మానాన్నే ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మినహా అసెంబ్లీలోని ప్రతిపక్ష, అధికారపక్ష చట్టసభ్యులు ఆమోదం తెలిపారు.

పంజాబ్ అసెంబ్లీ గురువారం అగ్నిపథ్ స్కీంకు వ్యతిరకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.  ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అశ్వని శర్మ, జంగి లాల్ మహాజన్‌లు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు.

పంజాబ్ అసెంబ్లీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సీఎం భగవంత్ మాన్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ సీఎం భగవంత్ మాన్ సింగ్ అగ్నిపథ్ స్కీంను తీవ్రంగా వ్యతిరేకించారు. తాను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమై ఈ అగ్నిపథ్ స్కీం విషయాన్ని లేవనెత్తుతానని అన్నారు. ఈ స్కీం దేశ యువతకు వ్యతిరేకంగా తెచ్చినదని ఆరోపించారు.

అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు శాసనసభా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ ప్రతాప్ సింగ్ బజ్వాా కూడా ఈ స్కీంను వ్యతిరేకించారు. అంతేకాదు, ఈ స్కీంను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అకాలీ ఎమ్మెల్యే మన్ ప్రీత్ సింగ్ అయాలీ కూడా అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చారు. అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ ను వ్య‌తిరేకిస్తూ తీర్మానం చేయాల‌ని పంజాబ్ ప్ర‌తిప‌క్షాలు ఇటీవలే రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరాయి. దీనికి సీఎం స‌మ్మ‌తం తెలిపారు. అసెంబ్లీ స‌మావేశాల్లో జీరో అవ‌ర్ స‌మ‌యంలో సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ‘అగ్నిపథ్’ అంశాన్ని లేవనెత్తారు. ఈ పథకం పంజాబ్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. 

ప్రస్తుతం సైన్యంలో పంజాబ్ నుంచి 7.8 శాతం యువత ప్రాతినిధ్యం వహిస్తోందని అయితే ఈ పథకం వల్ల భవిషత్తులో అది 2.3 శాతానికి పడిపోతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ పథకం పంజాబ్ ప్రయోజనాలకు విరుద్ధం అని మిస్టర్ బజ్వా వాదించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో సీఎం ఉమ్మడి తీర్మానం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విష‌యంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. దీనిని ఒక భావోద్వేగ సమస్యగా అభివర్ణించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు బజ్వా సూచనను ఆమోదించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఈ పథకానికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావాలని అన్నారు. ‘‘ నేను ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను బజ్వాతో ఏకీభవిస్తున్నాను. ఆయ‌న సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాం’’ అని అన్నారు. ‘‘ ఒక 17 ఏళ్ల యువకులు రక్షణ దళాలలో చేరితారు. అందులో ఎక్కువ మంది యువ‌కులు నాలుగేళ్ల స‌ర్వీస్ త‌రువాత ఇంటికి తిరిగి వ‌స్తారు. అప్పుడు వారు మాజీ అవుతారు. అయితే అలా మాజీ అయిన వారికి త‌రువాత ఎలాంటి ప్ర‌యోజ‌నాలు కూడా ఉండ‌వు ’’ అని భగవంత్ మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ పార్టీ ఆఫీసులో భద్రతా సిబ్బందిని నియామించాల్సి వస్తే అగ్నివీర్లుగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తాన‌ని బీజేపీ నాయ‌కుడు కైలాష్ విజ‌య‌వ‌ర్గీయ అన్నార‌ని సీఎం భ‌గ‌వంత్ మాన్ అన్నారు. ఇది సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios