తమిళనాడులో ఎన్నికల పర్వం మొదలైంది. మరో రెండు వారాల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో.. సీఎం పళని స్వామిని తక్కువ చేస్తూ.. డీఎంకే నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీశాయి.

ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రత్యర్థులు మాటల తూటాలతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. తాజాగా.. ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు సంచనలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజా మాట్లాడుతూ ఒక బెల్లం కొట్టులో కూలీగా పనిచేసే పళని స్వామి ..స్టాలిన్ తో పోటీచేయడమా? ఆయన చెప్పు పాటి విలువ లేదు ఈయనకు. అలాంటిది స్టాలిన్ తోనే సమరమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

అంతేకాకుండా నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే దానికి కారణం డబ్బు.. రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నా తమ పార్టీ ఆయనను రక్షిస్తుందని నమ్మకంతోనే ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఒకవేళ పళనిస్వామి కనుక గెలిస్తే సీఎం వాహనం తన నివాసం నుండి కార్యాలయం వరకు కూడా వెళ్ళదని తెలిపారు.

ప్రస్తుతం ఈ ఘాటు వ్యాఖ్యలు తమిళ రాజాకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇకపోతే ఈ మాటలపై పళనిస్వామి స్పందించారు. తానూ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టానని, స్టాలిన్ తండ్రి సీఎం కాబట్టి ఆయన సిల్వర్ స్పూన్ తో పుట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.