Communal violence: గుజరాత్ లోని వడోదరలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ మత హింసకు సంబంధించి పోలీసులు 20 మంది అదుపులోకి తీసుకున్నారు.
Gujarat Communal violence: శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపుల క్రమంలో దేశంలోని పలు చోట్ల హింసాత్మక మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు చనిపోవడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశరాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి నుండి మత హింస నివేదించబడిన కొద్ది రోజులకే.. గుజరాత్‌లోని వడోదర ప్రాంతంలో కూడా మత ఘర్షణలు చోటుకచేసుకున్నాయి. అయితే, ఈ హింసాత్మక మత ఘర్షణలు చిన్న రోడ్డు ప్రమాదం గొడవతో ప్రారంభమయ్యాయి. తక్కువ సమయంలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు రాళ్లతో దాడి చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని వడోదరలో జరిగిన మత ఘర్షణల కారణంగా అల్లర్లు చెలరేగాయి. రాళ్లు రువ్వడం, ఒక మందిరాన్ని ధ్వంసం చేయడం, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన సంఘటన తర్వాత అల్లర్లకు పాల్పడినందుకు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెట్టు చేశారు. నగరంలోని రావ్‌పురా ప్రాంతంలో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ద్విచక్ర వాహనాల మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య మత ఘర్షణలకు దారి తీసిందని కరేలిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
తక్కువ సమయంలోనే ఈ అంశం తీవ్రస్థాయికి చేరుకుంది. రావ్‌పురా ప్రాంతానికి పొరుగున ఉన్న కరేలిబాగ్ ప్రాంతంలో రెండు వర్గాల ప్రజలు గుమిగూడి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రెండు ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాలతో రోడ్డు పక్కన ఉన్న గుడి వద్ద ఉన్న విగ్రహాన్ని ఒక గుంపు ధ్వంసం చేసిందని పోలీసు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు,మారణాయుధాలు పట్టుకుని ఉండటం, వేరే మతాల వారిని కించపర్చేలా చర్యలకు పాల్పడటం వంటి అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు కమిషనర్ చిరాగ్ కొరాడియా తెలిపారు.
అదనపు పోలీసు కమిషనర్ చిరాగ్ కొరాడియా మీడియాతో మాట్లాడుతూ..“కరేలీబాగ్ ఎఫ్‌ఐఆర్‌లో అల్లర్ల కు కారణమైన మొత్తం 20 మంది వ్యక్తులను నిన్న రాత్రి నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో అరెస్టు చేశామని తెలిపారు. ఈ మత హింసకు కారణమైన మరికొంత మంది గుర్తు తెలియని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా, హనుమాన్ జయంతి రోజున దేశ రాజధాని న్యూఢిల్లీలో జహంగీర్‌పురి ప్రాంతంలో ఒక ఊరేగింపుపై దాడి చేయడంతో మత హింసకు దారితీసింది. అలాగే, దేశంలోని కొన్ని ప్రాంతాలలో మతపరమైన హింసాత్మక సంఘటనలు నమోదైన రోజుల తర్వాత గుజరాత్ లో కూడా మత హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. శ్రీరామ నవమి సందర్భంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. అలాగే, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగాయి.