కశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో ఓ ఆలయంలో నిర్వహించిన మహా యజ్ఞంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ఎఫ్ హమీద్ స్వయంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన స్వయంగా పాల్గొని భక్తులతో కలిసిపోయారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆ ఆలయంలో మళ్లీ యజ్ఞం నిర్వమించారు. 

బుడ్గాం: కశ్మీర్‌లో మతసామరస్యం వెల్లివిరిసింది. హిందూ పండిట్లు ఓ ఆలయంలో నిర్వహించిన మహాయజ్ఞంలో బుడ్గాం డిప్యూటీ కమిషనర్ ఎస్ఎఫ్ హమీద్ హాజరయ్యారు. హోమం జరిగినప్పుడూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. కశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో హిందూ కమ్యూనిటీ రెగెన్య మాతా ఆస్థాపన్ ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి ఈ ఆలయంలో మళ్లీ మహాయజ్ఞం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై డీసీ ఎస్ఎఫ్ హమీద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారని, కశ్మీర్‌లో సౌభ్రాతృత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు. హమీద్ 2017 ఐఏఎస్ అధికారి. అసోం, మేఘాలయా క్యాడర్‌కు చెందిన ఈయన డిప్యూటేషన్ మీద స్వరాష్ట్రానికి వచ్చారు.

ఆలయంలో ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చర్యలు తీసుకోవాలని డీసీ హమీద్ జిల్లా అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశించారు.

Also Read: మత సంస్కర్త శ్రీమంత శంకరదేవా తాత్వికతపై అధ్యయనం.. యూఎస్‌టీఎంలో చైర్ ఏర్పాటు చేస్తామన్న చాన్సిలర్ మహబూబల్ హక్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ కశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని మొత్తం కశ్మీరీ పండిట్ల తరఫున ఆయన ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినందుకు, ఇందులో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి తోడ్పడ్డారని వివరించారు. 

1989 తర్వాత ఈ ఆలయంలో మళ్లీ హోమం జరగడం ఇదే ప్రథమం.