Ram Navami Rallies: శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శ్రీరాముని శోభయాత్రల్లో నాలుగు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు గాయపడ్డారు.
Communal Clashes: శ్రీరాముడి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీరాముని శోభయాత్రలు నిర్వహించారు. అయితే, పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఊరేగింపుల సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి.
టాప్-10 అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి..
1. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లోని కొన్ని ప్రాంతాలు రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ కర్ఫ్యూ విధించినట్లు సీనియర్ అధికారి తెలిపారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.
2. తలాబ్ చౌక్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ఊరేగింపుపై లౌడ్ స్పీకర్ల నుండి వచ్చే మ్యూజిక్ కారణంగా జరిగిన ఈ వాగ్వాదంలో.. రాళ్లు రువ్వడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయని అదనపు కలెక్టర్ ఎస్ఎస్ ముజల్దే తెలిపారు. "పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు టియర్‌గ్యాస్ షెల్స్‌ను కాల్చవలసి వచ్చింది" అని వెల్లడించారు.
3. వాహనాలకు నిప్పు పెట్టడం, కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువు షెల్స్ ప్రయోగించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ చౌదరి సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టారు, ఒక దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
4. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంభాట్ మరియు సబర్‌కాంత జిల్లా హిమ్మత్‌నగర్‌లలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు చోట్లా రాళ్లు రువ్వడం, వస్తులవుకు నిప్పుపెట్టడం వంటి సంఘటనలు జరిగాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు షెల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
5. ఖంభాట్‌లో పోలీసు సూపరింటెండెంట్ అజీత్ రాజ్యన్ మాట్లాడుతూ, "రామ నవమి ఊరేగింపులో రెండు గ్రూపులు ఘర్షణ పడిన స్థలం నుండి సుమారు 65 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం" అని తెలిపారు.
6. హిమ్మత్‌నగర్‌లోఒక గుంపు కొన్ని వాహనాలు మరియు దుకాణాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే పరిస్థితి మరింతగా ముదరకుండా రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని నియంత్రించడానికి టియర్‌గ్యాస్ షెల్‌లను ఉపయోగించాల్సి వచ్చింది. కొట్లాట సమయంలో కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టుకున్నారని సబర్‌కాంత పోలీసు చీఫ్ విశాల్ వాఘేలా తెలిపారు.
7. బెంగాల్‌లోని హౌరాలో, షిబ్‌పూర్ ప్రాంతంలో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
8. రామనవమి ఊరేగింపుపై పోలీసులు దాడి చేశారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. రామనవమి ఊరేగింపులో పాల్గొన్న వారిపై పోలీసు సిబ్బంది లాఠీల వర్షం కురిపించారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.
9. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు సంయమనం పాటించాలని హౌరాలోని నివాసితులను పోలీసులు కోరారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా వారిని హెచ్చరించారు.
10. రామ నవమి ఊరేగింపులపై రాళ్లు రువ్వడం మరియు కాల్చడం వంటి నివేదికలు జార్ఖండ్‌లోని లోహర్దగా నుండి కూడా వచ్చాయి. ఒక వ్యక్తి గాయాలపాలై మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొంతమంది గాయపడినట్లు సమాచారం. శాంతిభద్రతలను కాపాడేందుకు భారీ బలగాలు రంగంలోకి దిగాయి.
