Asianet News TeluguAsianet News Telugu

నా ఇంటికి రా భయ్యా.. ఇది నీ ఇల్లు అనుకో..: బంగ్లా ఖాళీ చేయనున్న రాహుల్‌కు రేవంత్ ఆహ్వానం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ లేఖను పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంపై రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం రాసిన లేఖను పేర్కొంటూ తన ఇంటికి రావాలని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
 

come to my home, tpcc chief revant reddy welcomes rahul gandhi after orders of vacating buglow kms
Author
First Published Mar 28, 2023, 6:55 PM IST

హైదరాబాద్: ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి లేఖ వచ్చింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడ్డ తర్వాత ఈ లేఖ ఆయనకు అందింది. దీనిపై రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం స్పందించారు. ఆ ఆదేశాలను శిరసావహిస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాసిన లేఖపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బంగ్లా ఖాళీ చేయనున్న రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. రాహుల్ గాంధీని అన్నయ్య అని సంభోదిస్తూ తన ఇంటికి వచ్చేయాలని కోరారు. తన ఇంటికి వచ్చేయాలని, వెల్‌కమ్ చెప్పారు. ‘రాహుల్ భయ్యా, నా ఇల్లు.. మీ ఇల్లు. నా ఇంటికి వచ్చేయాలని మీకు స్వాగతం పలుకుతున్నాను. మనమంతా ఒక కుటుంబం. ఇది మీ ఇల్లు కూడా’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మోడీ ఇంటి పేరు కేంద్రంగా గుజరాత్‌లోని సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ కాగా.. ఆ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష పడింది. రెండేళ్ల శిక్ష పడ్డ రాహుల్ గాంధీని లోక్‌సభ సెక్రెటేరియట్ నిబంధనలకు లోబడి పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించింది. అనంతరం, ఎంపీగా ఆయనకు కేటాయించిన ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను పాటిస్తానని రాహుల్ గాంధీ తన లేఖ పేర్కొన్నారు.

Also Read: అతిక్ అహ్మద్‌కు ప్రత్యేక జైలు బ్యారక్.. పప్పు, చపాతి, కర్రీతో డిన్నర్.. ప్రయాగ్‌రాజ్ జైలులో రాత్రి ఇలా..!

దీనికి భావోద్వేగపూరితంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు. తాను బంగ్లా ఖాళీ చేసి రాహుల్ గాంధీకి ఇస్తానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రియాక్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios