గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో తెలుగు కల్నల్ సంతోష్ సహా దాదాపుగా 20 మంది సైనికులు వీరిమరణం పొందారు. అసలు ఆ లోయలో ఇరు బలగాల మధ్య ఘర్షణ ఎందుకు చోటుచేసుకుందని విషయంలో ఇప్పటివరకు సరైన కారణం తెలియరావడంలేదు. 

అందుతున్న సమాచారం మేరకు సోమవారం ఉదయం భారత్, చైనా ఆర్మీ అధికారుల మధ్య గాల్వాన్ లోయ ప్రాంతంలో కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. చర్చల అనంతరం తాము వెనక్కి వెళుతామని చైనా సైనికాధికారులు అంగీకరించారు. కల్నల్ సంతోష్ బాబు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. 

చైనా సేనలు ఎంతమేర వెనక్కి వెళ్ళాయో చూడడానికి 16 బీహార్ కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు, 50 మంది సైనికుల బృందం పాట్రోలింగ్ కి వెళ్ళింది. చైనా సైనికులు వెనక్కి వెళుతుండగా... భారత భూభాగంలో చైనా సైనికులు నిర్మించిన తాత్కాలిక వసతి సదుపాయాలను, టెంట్లను భారత సైనికులు నేలమట్టం చేసారు. 

ఇది జరుగుతుండగానే అనూహ్యంగా చైనా సైనికులు అనూహ్యంగా భారీ సంఖ్యలో మోహరించి... మెరుపు వేగంతో భారతసైనికులపై దాడికి దిగే దుస్సాహసానికి ఒడిగట్టారు. అక్కడ అందుబాటులో ఉన్న రాడ్లు, కర్రలు, రాళ్ళూ అన్నిటితో భారత జవాన్లపై దాడికి తెగబడ్డారు. 

భారత సైన్యం కూడా వారికీ తగిన రీతిలో సమాధానం చెప్పారు.(బుల్లెట్లు పేలాయా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.) భారత పాట్రోలింగ్ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్ సంతోష్ బాబు తన బృందానికి ముందు వరుసలో నిలబడ్డారు. 1975 తరువాత చైనా సరిహద్దుల్లో జరిగిన తొలి సైనిక మరణం ఇదే కాగా, 1962 తరువాత ఇంత భారీస్థాయిలో 20 మంది మరణించడం ఇదే తొలిసారి. 

ఈ ఘర్షణలో భారతీయ సైనికుల చేతిలో దాదాపుగా 40 మంది వరకు చైనా సైనికులు కూడా మరణించారని ఏఎన్ఐ కథనం ప్రసారం చేసింది. ఎంతమంది మరణించారన్న సమాచారం కరెక్ట్ గా లేకున్నప్పటికీ... చైనా సైనికులు కూడా మరణించారన్నది నిజం. చైనా కు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక కూడా దీన్ని ధృవీకరించింది. 

భారతసైనికులు కేవలం 50 మందే ఉండడం, చైనా వాళ్ళు దాదాపుగా 250 మంది ఒక్కసారిగా జమ అవడంతో భారతీయ సైనికుల మరణం సంభవించింది. ఇంకొక ఆందోళ కలిగిస్తున్న వార్త ఏమిటంటే... మరో నలుగురు అధికారులు, కొందరు సైనికుల జాడ దొరకడంలేదు. వారిని భారీ సంఖ్యలో ఉన్న చైనా సైనికులు అపహరించారు అనే అనుమానం వ్యక్తమవుతుంది. 

గాల్వాన్ నది మధ్యలో ఈ ఘర్షణ చోటు చేసుకోవడం, గాల్వాన్ నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో.... గాయపడ్డ సైనికులు ఆ నదిలో కొట్టుకుపోయారు. అందువల్ల కూడా మరణాలు అధికంగా నమోదయ్యాయి. చైనా సైనికులు పథకం ప్రకారమే దాడి చేసారు. వారు అక్కడకు చేరుకునే ముందే కర్రలు, రాడ్లను తీసుకొని వచ్చారని సమాచారం.