ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా , సీనియర్ న్యాయవాది విశ్వనాథన్‌‌లను సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులుగా నిలయమించాలని కొలీజియం సిఫారసు చేసింది.

ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రాకు ప్రమోషన్ ఛాన్స్ వచ్చింది. ఆయనను సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. ఆయనతో పాటు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్‌ను పేరును కూడా కొలీజియం సిఫారసు చేసింది. వీరిద్దరిని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో 32 మంది న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్ట్‌లో న్యాయమూర్తుల సంఖ్య 34కి పెరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మార్ షా, దినేశ్ మహేశ్వరిలు పదవీ విరమణ చేశారు. విశ్వనాథన్ గనుక న్యాయమూర్తిగా నియమితులైతే.. ఆయన సీనియారిటీ ప్రకారం 2030లో సీజేఐ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అలాగే రోస్టర్ ప్రకారం జస్టిస్ జేబీ పార్ధీవాలా 2028లో సీజేఐగా బాధ్యతలు చేపట్టి.. రెండేళ్ల పాటు పదవిలో వుండనున్నారు.